గూగుల్ మ్యాప్ చూపిన మార్గంలో ఓ డాక్టర్ దంపతులు కారులో వెళ్లి చేతిబిడ్డతో పాటు బురదలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.ధర్మపురి జిల్లా నల్లంపల్లికి చెందిన పళనిస్వామి (27), కృత్తిక (27) అదే ఇద్దరు డాక్టర్లు నాలుగు నెలల చంటిబిడ్డ, కృత్తిక బంధువు పావేందర్ (25) అనే డాక్టర్ కలిసి కారులో పళని మురుగన్ ఆలయానికి బయలుదేరారు. కారును పావేందర్ నడిపాడు. ఆదివారం వేకువజామున ఆ కారు కరూరు - దిండుగల్ ఫోర్‌వేలో తమ్మనపట్టి ఫ్లైఓవర్ దాటింది.
అక్కడి నాలుగురోడ్ల కూడలిలో కారు ఎటువైపు నడపాలో తెలియక పావేందర్ గూగుల్ మ్యాప్ ఆన్ చేశారు. ఆ మ్యాప్ ద్వారా వచ్చిన మెసేజ్ ప్రకారం కారును కుడి వైపు తిప్పారు. ఆ కారు బురదగా ఉన్న మట్టిరోడ్డులో చిక్కుకుంది. ముందుకు, వెనుకకు కదలలేక బురదలో కారు కూరుకుపోయింది. వేకువజాము కావటంతో ఆ మార్గంలో జనసంచారం కూడా లేకపోవడంతో పళనిస్వామి, పావేందర్, కృత్తిక ముగ్గురూ కలిసి కారును కదిల్చేందుకు ప్రయత్నించినా కుదరలేదు.అగ్నిమాపక శాఖ అధికారులకు ఫోన్ చేయడంతో వేడచందూరు నుండి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని కారును బురదలో నుంచి బయటకు తీశారు. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన మార్గంలో ప్రయాణించిన ఆ డాక్టర్లు చివరకు పళని క్షేత్రానికి చేరుకున్నారు.