2024 సంవత్సరంలో వేర్వేరు కారణాల వల్ల బంగారం ధర భారీగా పెరిగింది. బంగారానికి సాధారణంగా ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది అయినప్పటికీ ఈ సంవత్సరం మాత్రం ఇంకాస్త ఎక్కువే పెరిగిందని చెప్పొచ్చు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు (డిసెంబర్ 15) మొత్తంగా గోల్డ్‌పై 20 శాతం రిటర్న్స్ వచ్చినట్లు తెలిసింది. ఇది ఈ ఏడాదిలో సెన్సెక్స్, నిఫ్టీ కంటే కూడా ఎక్కువ రాబడి అందించింది. అంతే కాకుండా.. గత రెండు సంవత్సరాల్లోని తన సొంత పనితీరు కంటే మెరుగ్గా రిటర్న్స్ ఇచ్చింది. ఇక మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, కేంద్ర బ్యాంకులు బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేయడం వంటి కారణాలతో బంగారం ధర ఈ ఏడాది భారీగా పెరిగినా.. వచ్చే ఏడాది మాత్రం ప్రతికూలతలు ఎదురుకానున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది డాలర్, క్రిప్టో కరెన్సీలను బలపరిచే క్రమంలో.. గోల్డ్ రిటర్న్స్ ఆశాజనకంగా ఉండకపోవచ్చని అనుకుంటున్నారు.
గోల్డ్ ఏడాదిలో 20 శాతం రాబడి అందించగా.. ఇదే సమయంలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 12 శాతానికి పరిమితమయ్యాయి. బంగారంపై రిటర్న్స్.. సెన్సెక్స్, నిఫ్టీ మాత్రమే కాకుండా.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బాండ్స్‌ను కూడా అధిగమించిందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌కు చెందిన జతీన్ త్రివేది చెప్పారు. ఈ కమొడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్, అనలిస్ట్ ఇచ్చిన టార్గెట్ ధర రూ. 75 వేలను కూడా దాటిందన్నారు.
ఈ ఏడాది మరికొద్ది రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో.. దేశీయంగా 20 శాతానికిపైగా రిటర్న్స్‌తోనే ముగించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే ఇది దాదాపు 27 శాతానికిపైగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే.. ఇలా ఏడాదిని సానుకూలంగా ముగించనుండటం ఇది వరుసగా మూడోసారి అని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈబీజీ- కమొడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మేర్ అన్నారు.
బంగారం లోహం.. ఇప్పటికీ సిల్వర్, నాచురల్ గ్యాస్‌తో కలిసి టాప్- 3 కమొడిటీస్ లిస్టులో ఉందని మేర్ చెప్పుకొచ్చారు. అయితే.. గోల్డ్ అంచనాల్ని మించి రాణించిందన్న ఆయన.. 2024 క్యాలెండర్ ఇయర్‌లో దాదాపు 12-14 శాతం వృద్ధి మాత్రమే అంచనా వేశామన్నారు. రాజకీయ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే గత 7 త్రైమాసికాలుగా బంగారం ధర పెరుగుతూ వచ్చిందన్నారు.
గత కొన్నేళ్లలో చూస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ప్రకారం.. బంగారంపై అత్యధిక రిటర్న్స్ 2020లో వచ్చింది. అప్పుడు ఏకంగా 28 శాతం పెరగడం విశేషం. తర్వాత 2019లోనూ 25 శాతంతో ఉంది. 2021లో 4 శాతం నష్టపోయింది. అంటే నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 2022, 23ల్లో వరుసగా 14, 15 శాతం చొప్పున రిటర్న్స్ ఇచ్చింది.