గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ను నిర్వీర్యం చేసిందని, తాము ఆ పథకాన్ని పునరుద్ధరిస్తామని మంత్రి పార్ధసారథి వివరించారు. గత ప్రభుత్వం చేతకానితనం, దుష్పరిపాలన కారణంగా రాష్ట్రం ఎంత నష్టపోయిందో చెప్పడానికి ఈ జల్ జీవన్ మిషన్ ఒక ఉదాహరణ అని అన్నారు.ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలని జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు జారీ చేసిందని, కొన్ని చిన్న రాష్ట్రాలు సైతం లక్ష కోట్ల నుంచి లక్షన్నర కోట్ల రూపాయల మేర పనులు చేశాయని వివరించారు. మనకంటే చిన్న రాష్ట్రం కేరళ రూ.70 వేల కోట్ల వరకు ప్రతిపాదనలు పంపిందని తెలిపారు. కానీ మన రాష్ట్రంలో రూ.26,804 కోట్లకు ప్రతిపాదనలు పంపి, అందులోనూ రూ.4 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి పార్థసారథి ఆరోపించారు. ఇలాంటి నష్టాలు కోకొల్లలు అని విమర్శించారు. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా ప్రజలు పరిశుభ్రమైన తాగునీటికి దూరమయ్యారని వ్యాఖ్యానించారు.