టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి లండన్ అంటే చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే. తరచుగా కోహ్లీ లండన్ కు వెళుతుంటాడు. అక్కడ ఆయన ఒక ఇల్లు కొన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. తన రిటైర్మెంట్ తర్వాత మిగిలిన జీవితాన్ని లండన్ లో గడపాలని కోహ్లీ భావిస్తున్నాడట. ఈ విషయాన్ని ఆయన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ తెలిపారు. తన భార్య అనుష్క, పిల్లలతో కలసి లండన్ లో స్థిరపడాలని కోహ్లీ యోచిస్తున్నాడని శర్మ వెల్లడించారు. త్వరలోనే ఆయన లండన్ కు షిఫ్ట్ కాబోతున్నాడని చెప్పారు. కోహ్లీ 2027 ప్రపంచ కప్ వరకు ఆడతాడని తెలిపారు. ప్రస్తుతం కోహ్లీ అత్యుత్తమ క్రికెట్ ఆడుతున్నాడని... ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో సెంచరీ చేశాడని... చివరి రెండు మ్యాచ్ లలో మరో రెండు సెంచరీలు చేస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లీ ఫిట్ గా ఉన్నాడని... రిటైర్ అయ్యేంత వయసు ఇంకా రాలేదని చెప్పారు. కోహ్లీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని అన్నారు.