టీమిండియాతో మిగిలిన రెండు టెస్టులకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టు నుంచి ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీకి ఉద్వాసన పలికింది. అతడి స్థానంలో సామ్ కొన్‌స్టాస్‌కు తొలిసారి జాతీయ జట్టులో చోటిచ్చింది. ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్సన్కు కూడా భారత్‌తో మెల్బోర్న్, సిడ్నీ టెస్టులకు ఎంపిక చేసింది. కాగా గాయం వల్ల 2021-22 యాషెస్ సిరీస్ తర్వాత టెస్టు జట్టుకు దూరమైన రిచర్డ్సన్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక సీన్ అబాట్ కూడా పునరాగమనం చేయగా అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్ కూడా జట్టుతో కొనసాగనున్నాడు. గాయపడ్డ స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్.. నాలుగు, ఐదో టెస్టులకు పూర్తిగా దూరమయ్యాడు. కాగా ఆస్ట్రేలియా-'ఎ' తరఫున రాణించిన మెక్‌స్వీనీ టీమిండియాతో తొలి టెస్టు సందర్భంగా పెర్త్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లోనూ అతడు నిరాశపరిచాడు. ఫలితంగా మెక్‌స్వీనీ (ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 72 రన్స్)పై వేటు వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. సామ్ కొన్‌స్టాస్‌కు తొలిసారి పిలుపునిచ్చింది. కాగా సామ్ తన చక్కటి బ్యాటింగ్ శైలితో జూనియర్ రిక్కీ పాంటింగ్‌గా విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. 19 ఏళ్ల ఈ యువ బ్యాటర్ ఇటీవల షెఫీల్డ్‌షీల్డ్ మ్యాచ్‌లో సౌత్ వేల్స్‌కు ప్రాతినిథ్య వహించాడు. సౌత్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో వరుస సెంచరీలు(152, 105) బాదాడు.
మెల్బోర్న్(డిసెంబరు 26-30)లో, సిడ్నీ(జనవరి 3-7) నాలుగు, ఐదో టెస్టులు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌ల ఫలితంపైనే ఆసీస్- టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. భారత్‌తో మూడు, నాలుగు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్(వైస్ కెప్టెన్), స్టీవ్ స్మిత్(వైస్ కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, జే రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.