పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పార్శిల్‌లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో.. యండగండిలో కలకలం రేపింది. మృతదేహం చూసి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పార్శిల్‌లో ఒక ఉత్తరం కూడా ఉంది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ నయీం అస్మి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. యండగండి గ్రామంలో నివాసం ఉంటుంన్నముదునూరి రంగరాజు (55)కు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్దమ్మాయి సాగి తులసికి శ్రీనివాసరాజుతో వివాహం కాగా.. నిడదవోలులో నివాసం ఉండేది. శ్రీనివాసరాజు అప్పులు చేసి పది సంవత్సరాల క్రితం ఇంట్లో నుండి వెళ్లిపోవడంతో.. తులసి తిరిగి యండగండి గ్రామం వచ్చేసింది. ప్రస్తుతం గరగపర్రు గ్రామంలో నివాసం ఉంటూ.. భీమవరం దుర్గ స్టిల్స్ లో ఉద్యోగం చేసుకుంటుంది. ఈమెకు ఒక కూతురు ఉంది. తులసికి యండగండి గ్రామం జగనన్న కాలనీలో ప్రభుత్వం నుంచి స్థలం మంజూరు కాగా.. ఇల్లు నిర్మిస్తోంది. ప్రస్తుతం తులసి ఇల్లు ప్లాస్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు చేసుకోగా.. మొదటి విడతలో పెయింట్ డబ్బాలు, టైల్స్ అందజేసింది. తులసి తల్లితండ్రులు యండగండిలో ఉండటంతో.. వారి అడ్రస్ కి సేవా సమితి ఇంటి సామాన్లు పంపిస్తోంది. విద్యుత్ సామగ్రి కొరకు తులసి మరోసారి ఆర్థిక సాయంకు దరఖాస్తు చేసుకుంది. పార్శిల్‌లో విద్యుత్ సామగ్రికి బదులు మృతదేహం వచ్చింది. అది చూసి తులసి సహా కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. పార్శిల్‌లో ఒక ఉత్తరం కూడా ఉంది. రూ.1.30 కోట్లు చెల్లించాలని, లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అందులో రాసుంది. తులసి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పార్శిల్‌లో సుమారు 45 ఏళ్ల వయసున్న మగ వ్యక్తి మృతదేహంను గురించారు. దర్యాప్తు కొనసాగుతోంది.