వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ 55వ సమావేశం రాజస్థాన్‌లో జైసల్మేర్‌లో శనివారం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహించిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, ముందుగా అంచనా వేసిన కీలక అంశాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోడవం గమనార్హం. వచ్చే సమావేశంలో ఆ నిర్ణయాలు ఉండవచ్చని భావిస్తున్నారు. జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ మినహాయింపు సహా పలు కీలక అంశాలపై నిర్ణయాలు వాయిదా పడ్డాయి. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
సుదీర్ఘంగా సాగిన సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను వెల్లడించారు. జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై వస్తు సేవల పన్ను (Goods and Services Tax) మినహాయింపు కల్పించే అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ ఐఆర్‌డీఏఐ సహా మరికొన్ని ఇన్‌పుట్స్ రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
జీఎస్టీ కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
ఫోర్ట్‌ఫైడ్ బియ్యంపై జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
జన్యు పరమైన వైద్య చికిత్సలకు జీఎస్టీ మినహాయింపు కల్పించారు.
లోన్ తీసుకున్న వారికి ఊరట కల్పించారు. రుణ గ్రహీతలు లోన్ చెల్లింపుల ఆలస్యంపై బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు వేసే జరిమానాలపై జీఎస్టీ తొలగించారు.
రూ.2 వేల లోపు పేమెంట్లు చేసే పేమెంట్ అగ్రిగేటర్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించారు. పేమెంట్ గేట్ వేలకు, ఫిన్ టెక్ సంస్థలకు ఈ నిర్ణయం వర్తించదు.
పరిహార సెస్సుకు సంబంధించి ఏర్పాటైన మంత్రుల బృందానికి నివేదిక సమర్పించేందుకు మరింత గడువు ఇచ్చారు.
రేట్ల హేతుబద్ధీకరణకు సంబంధించి నివేదిక పూర్తి కాకపోవడంతో ప్యానెల్‌కు మరింత సమయం ఇచ్చారు.
ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్స్ అయిన స్విగ్గీ, జొమాటోలపై పన్ను రేట్లపై నిర్ణయం వాయిదా.
పాత, యూజ్డ్ కార్ల విక్రయాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంపు. వ్యక్తిగత విక్రయాలకు ఇది వర్తించదు.