ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో జరిపిన నాలుగు రోజుల పర్యటన విజయవంతమైంది. ఈనెల 19వ తేదీన శాంతిపురం మండలం కడపల్లె వద్ద సొంత ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి, కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో మమేకమై, గుడుపల్లె మండలం నలగాంపల్లెలో మహిళలతో ముఖాముఖితో ప్రారంభమైన భువనేశ్వరి పర్యటన, కుప్పం , రామకుప్పం, శాంతిపురం మండలాలమీదుగా సాగి, ఆదివారంనాడు రామకుప్పం మండలం చెల్దిగానిపల్లెలో మహిళలతో ముఖాముఖితో ముగిసింది. ఇక్కడినుంచి పలమనేరు నియోజకవర్గం వి.కోటకు చేరుకుని, అక్కడ ఎన్టీఆర్ సుజల ప్లాంటు పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్నాక, బెంగళూరుకు అక్కడినుంచి హైదరాబాదుకు పయనమై వెళ్లారు.ముఖ్యమంత్రి సతీమణిగానో లేదా రాజకీయంగానో తాను ఇక్కడికి రాలేదన్న భువనేశ్వరి తొలుత చెప్పినట్లుగానే ఎన్టీఆర్ ట్రస్టు కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు.
కుప్పంలో ట్రస్టు తరఫున నడుస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను విస్తరించారు. దివ్యాంగులకు వినికిడి యంత్రాలు, మూడు చక్రాల సైకిళ్లు, చిరు వ్యాపారులకు తోపుడు బళ్లు వితరణ చేశారు. ఇంకా ట్రస్టు కార్యక్రమాలను విస్తరిస్తామని, కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకు ప్రారంభిస్తామని చెప్పారు. ఇక అక్కడినుంచి నాలుగు మండలాలతోపాటు కుప్పం మున్సిపాలిటీలో కూడా మహిళలతోను, డ్వాక్రా సంఘాలతోను ముఖాముఖిలో పాల్గొన్నారు. వారి సాదకబాధకాలు విని, తీరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున హామీ ఇచ్చారు. కేవలం కుప్పం నియోజకవర్గంలోనే ఏకంగా 40 రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. గత ప్రభుత్వం అరాచక పాలన సాగించి, నియోజకవర్గ ప్రజలను దోచి తమ జేబులు నింపుకున్నదని విమర్శలు చేయడమే కాదు, వచ్చే అయిదేళ్లలో అంతకంతా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.