జగన్ రాయలసీమ ద్రోహి అని, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నీటిపారుదల ప్రాజెక్టులు విధ్వంసానికి గురయ్యాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కనీసం ప్రాజెక్టుల గేట్లు కూడా మరమ్మతులకు నోచుకోలేదని, రాయలసీమ బిడ్డను అని చెప్పుకునే జగన్ సీమ ప్రాంతాన్ని మోసం చేశారని విమర్శించారు. ఆదివారం కడప జిల్లా కొండాపురం మండలంలోని గండికోట ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గోదావరి-పెన్నా నదుల అనుసంధానంతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని, రతనాల సీమగా తీర్చిదిద్దుతామని అన్నారు. 2025 జూలై చివరికల్లా హంద్రీ-నీవా పనులు పూర్తి చేసి చివరి ఎకరం వరకు నీరందిస్తామని తెలిపారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన జగన్.. గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు గత ఐదేళ్లలో రూ.450 కోట్లు పరిహారం ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు.