వైఎస్సార్పీనేత, మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పేదల బియ్యాన్ని పేర్ని నాని బొక్కేశారంటూ వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో నాని అడ్రస్ లేకుండా పారిపోయారన్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా సమాధానం చెప్ప లేదంటే తప్పు చేశానని ఒప్పుకున్నట్టే అని అన్నారు. ఇటీవల పేర్ని నానికి చెందిన గోడౌన్‌లో ఐదు వేల బస్తాల రేషన్ బియ్యం మాయం చేసి.. కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలించినట్టు పోలీసుల విచారణలో తేలిందన్నారు.
కేసు విచారణకు సహకరించకుండా పేర్ని నాని, అతని కుటుంబం మచిలీపట్నం నుంచి పరారైపోయిందన్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. ఏ తప్పు చేయకపోతే తన మేనేజర్‌తో హైకోర్టులో క్వాష్ పిటీషన్ ఎందుకు వేయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ జరుగుతోందని.. పేర్ని నాని అవినీతి మొత్తాన్ని బట్టబయలు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.