వందే భారత్ రైలుకు ప్రయాణికుల వచ్చిన అనూహ్య స్పందనతో వందే భారత్ స్లీపర్ రైలును రూపొందించిన రైల్వే శాఖ.. ఎట్టకేలకు పట్టాలెక్కించింది. తాజాగా వందే భారత్ రైలుకు సక్సెస్‌ఫుల్‌గా ట్రయల్ రన్ నిర్వహించారు. మధ్యప్రదేశ్‌లోని కజురహో నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబా రైల్వే స్టేషన్ల మధ్య రెండు రోజుల పాటు ఈ వందే భారత్ స్లీపర్ రైలుకు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్‌లో రైల్వే టెక్నికల్ టీమ్‌తోపాటు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ-చెన్నై అధికారులు కూడా పాల్గొన్నారు. గంటకు 115 కిలోమీటర్ల వేగంతో వెళ్లగా.. తిరిగి వచ్చేటపుడు 130 కిలోమీటర్ల వేగంతో విజయవంతంగా ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ట్రయల్ రన్‌లో అనేక టెక్నికల్ అంశాలను, ఆ వందే భారత్ స్లీపర్ రైలు పనితీరును అధికారులు నిశితంగా గమనించారు. ఇక వచ్చే ఏడాది జనవరిలో ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్న రైల్వే శాఖ తొలి దశలో 10 రైళ్లను ప్రవేశపెట్టనుంది.
శుక్రవారం సాయంత్రం చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి మధ్యప్రదేశ్‌లోని కజురహో రైల్వే స్టేషన్‌కు చేరుకున్న వందే భారత్ స్లీపర్ రైలు.. అక్కడి నుంచి శనివారం ఉత్తర్‌పప్రదేశ్‌లోని మహోబాకు చేరుకుంది. ఆ తర్వాతి రోజు కజురహో నుంచి తిరిగి మహోబాకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. రైల్వే డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ -ఎస్‌ఆర్‌డీవో ఆధ్వర్యంలో జరిగిన ఈ ట్రయల్ రన్‌లో రైల్వే టెక్నికల్ టీమ్, చెన్నై ఐసీఎఫ్ అధికారులు కూడా పాల్గొన్నారు. కజురహో నుంచి వెళ్తున్న సమయంలో గంటకు 115 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన ఈ వందే భారత్ స్లీపర్ రైలు.. తిరిగి వచ్చేటపుడు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక వందే భారత్ స్లీపర్ రైలును గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లేలా తయారు చేశారు.
వచ్చే ఏడాది జనవరిలో వందే భారత్ స్లీపర్ రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇక ఈ వందే భారత్ స్లీపర్ రైలులో.. విమానంలో ఉండే సౌకర్యాలు దాదాపుగా ప్రయాణికులకు అందిస్తారు. ఈ రైలులో లగ్జరీ హోటళ్లకు ఏమాత్రం తీసిపోదని రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఈ వందే భారత్ స్లీపర్ రైలులో ఒకేసారి 823 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. ఈ రైలులో ఒక ఫస్ట్ ఏసీ కోచ్, 4 సెకండ్ ఏసీ కోచ్‌లు, 11 థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయని వివరించాయి.
ఈ వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిచడంతో.. మరింత వేగంగా గమ్యస్థానాలకు ప్రయాణికులు చేరుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలులో ఫైర్ సేఫ్టీతో పాటు ప్రతి బెర్త్ వద్ద అత్యవసర స్టాప్ బటన్స్ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌకర్యం కోసం బెర్తులను మెరుగైన కుషన్‌తో రూపొందించారు. అప్పర్ బెర్తులు ఎక్కేందుకు మెట్లు ఏర్పాటు చేశారు. ఈ రైలులో బయో వాక్యూమ్ టాయిలెట్లు, టచ్ ఫ్రీ ఫిట్టింగ్‌లు, షవర్ క్యూబికల్స్, ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ డిస్‌ప్లేలు, ఛార్జింగ్ సాకెట్లు వంటి అదనపు సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి కోచ్‌లో ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ ఏర్పాటు చేశారు.
ఇక ప్రతి కోచ్‌లోనూ సీసీ కెమెరాలు ఉంచారు. ప్రతి బెర్త్ వద్ద ఛార్జింగ్ పెట్టుకునేందుకు సాకెట్ అందుబాటులో ఉంచారు. ప్రతీ బెర్త్ వద్ద చిన్న లైట్ బిగించారు. రైళ్లు ఢీకొనకుండా ఉండేందుకు కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా బ్లాట్ ప్రూఫ్ బ్యాటరీ, 3 గంటల ఎమర్జెన్సీ బ్యాకప్ కల్పించారు.