గాజాలో ప్రతీ గంటకో చిన్నారి ప్రాణాలు కోల్పోతుందని యునిసెఫ్ షాకింగ్ రిపోర్టు విడుదల చేసింది. దీనిపై యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ ఇన్ నియర్ ఈస్ట్ (యూఎన్ఆర్ డబ్ల్యూఏ) స్పందించింది. చిన్నారుల హత్యలను తీవ్రంగా ఖండించింది. యునిసెఫ్ ప్రకారం గాజాలో యుద్ధం ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు మొత్తం 14 వేల 500 మంది చిన్నారులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ప్రతీ గంటకు ఒక చిన్నారి చనిపోతుందని తెలిపింది. అయితే ఇవి కేవలం సంఖ్యలు మాత్రమే కావని.. జీవితాలని వివరించింది.
గాజాలో చిన్నారులపై జరుగుతున్న ఈ హింసాకాండను యూఎన్ఆర్ డబ్ల్యూఏ తీవ్రంగా ఖండించింది. ముఖ్యంగా ఈ దాడుల్లో గాయపడిన చిన్నారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని వెల్లడించింది. వాళ్లు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా గాయపడతారని వివరించింది. చదువుకు దూరమైన చిన్నారులు.. శిథిలాల మధ్య శవాలుగా, క్షతగాత్రులుగా తేలుతున్నారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా పిల్లలను చంపడాన్ని ఏమాత్రం సమర్థించలేమని యూఎన్ ఏజెన్సీ స్పష్టం చేసింది. గాజాలో రోజులు గడుస్తున్నా కొద్దీ చిన్నారులు తమ జీవితాలు, భవిష్యత్తులపై ఆశలు కోల్పోతున్నారని వెల్లడించింది.
గాజాలో యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 45 వేల 338 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ దాడులు పెరుగుతున్నా కొద్ది.. ప్రాణాలు కోల్పోయే పాలస్తీనియన్ల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. 2023వ సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయెల్‌పై భీకర దాడి చేసింది. ఇందులో మొత్తం 1200 మంది చనిపోగా.. 250 మందిని బందీలుగా చేసుకుంది. ఇక అప్పటి నుంచి ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. పగ తీర్చుకునేందుకు అనేక మంది పాలస్తీనా పౌరులను చంపేస్తోంది. ఈక్రమంలోనే అనేక మంది చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇటీవలే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్‌తో యుద్ధం ఆపే విషయాల గురించి స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇలా కనుక చేస్తే మళ్లీ హమాస్ కోలుకుని.. ఆపై తమపై దాడులకు పాల్పడుతుందని అన్నారు. అందుకే తాము యుద్ధాన్ని ఆపాలని అనుకోవడం లేదని వివరించారు. భవిష్యత్తులో జరిగే దాడులను సమూలంగా నాశనం చేసేందుకే తామింకా యుద్ధం కొనసాగిస్తున్నట్లు వివరించారు. మరి ఈ గొడవ ఎప్పుడు ఆగుతుందో చూడాలి.