మీరు కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటుంటే ఈ డిసెంబర్ నెలాఖరులోపు కొనడం మంచిది. ఎందుకంటే జనవరి నుంచి దాదాపు అన్ని కంపెనీల కార్ల ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మీరు బడ్జెట్ ధరల మంచి కారు కోసం చూస్తుంటే ఇది బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్ తమ బడ్జెట్ ధర కార్లపై రూ.75 వేల వరకు డిస్కౌంట్ కల్పిస్తోంది. ఈ కంపెనీ సైతం జనవరి నుంచి ధరలు పెంచుతున్నట్లు సమాచారం. మరి ఈ డిసెంబర్ 31లోపు కొనుగోలు చేసే వారికి ఏ కార్లపై డిస్కౌంట్ ఎంత లభిస్తుంది?అనేది ఇప్పుడే మనం తెలుసుకుందాం.
రెనాల్ట్ క్విడ్
రెనాల్ట్ కంపెనీకి చెందిన క్విడ్ మోడల్‌పై గరిష్ఠంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. రెనాల్ట్ క్విడ్ హ్యాచ్ బ్యాక్ కారు ప్రారంభ ధర రూ.4.70 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉండగా.. గరిష్ఠ ధర రూ.6.45 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది. ఈ కారు కొన్నవారికి క్యాష్ డిస్కౌంట్ రూ.20 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.15 వేలు, లాయాల్టీ బోనస్ రూ.10 వేలు కలిపి మొత్తం రూ.45 వేల వరకు వస్తుంది. అదే హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ లో కొంటే రూ. 65 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. బేస్ స్పెక్ ఆర్ఎక్స్ఈ, మిడ్ స్పెక్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్లు మినహా అన్నింటికి ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది.
రెనాల్ట్ ట్రైబర్..
రెనాల్ట్ కంపెనీకి చెందిన ట్రైబర్ కారు పై గరిష్ఠంగా రూ.60 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.25 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.15 వేలు, లాయాల్టీ బోనస్ రూ.20 వేలుగా ఉంటుంది. బేస్ స్పెక్ ఆర్ఎక్స్ఈ వేరియంట్ మినహా అన్ని వేరియంట్లకు ఆఫర్ వర్తిస్తుంది. ఆర్ఎక్స్ఈ వేరియంట్లు కేవలం లాయల్టీ బోనస్ వస్తుంది. ఈ కారు ధర రూ.6 లక్షల నుంచి రూ.8.98 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది.
రెనాల్ట్ కైగెర్..
రెనాల్ట్ కంపెనీకి చెందిన ఫ్యామిలీ కార్ రెనాల్ట్ కైగెర్ కారుపై గరిష్ఠంగా రూ.75 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.40 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.15 వేలు, లాయల్టీ బోనస్ రూ.20 వేల వరకు పొందవచ్చు. లోయర్ స్పెక్ ఆర్ఎక్స్ఈ, ఆర్ఎక్స్ఎల్ వేరియంట్లు మినహా అన్ని కార్లకు ఆఫర్ వర్తిస్తుంది. ఈ కారు ధర రూ.6 లక్షల నుంచిరూ.11.23 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది.