ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల విపరీతంగా పెరిగిపోతున్నాయి. కార్లు, బైకులతో పాటు పెద్ద పెద్ద వాహనాలు సైతం వేగంగా వెళ్తూ.. అనేక మంది ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవలే ఓ పెళ్లి బస్సు బోల్తా పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 21 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం వీరింతా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా అల్మోరా ప్రాంతం నుంచి ఓ బస్సు హల్ద్వానీకి బయలు దేరింది. ఈక్రమంలోనే 25 మంది ప్రయాణికులు ఈ బస్సు ఎక్కారు. బస్సులో జనాలు తక్కువగానే ఉన్నప్పటికీ డ్రైవర్ బస్సును వేగంగా నడిపాడు. అయితే మార్గమధ్యంలో రహదారిపై వంపులు ఎక్కువగా ఉన్నాయి. ఈక్రమంలోనే బస్సు భీమ్‌తాల్ ప్రాంతానికి చేరుకోగానే అదుపు తప్పింది. డ్రైవర్ ఎంతగా బస్సును అదుపు చేయాలని ప్రయత్నించినా అతడి వల్ల కాలేదు. ఈక్రమంలోనే బస్సు ఓ లోయలో పడిపోయింది.
విషయం గుర్తించిన స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే పోలీసులతో పాటు అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటాన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కూడా సమాచారం అందించారు. లోయలో పడ్డ బస్సులోంచి క్షతగాత్రులను బయటకు తీయాలంటే ఎక్కువ మంది సాయం అవసరం అయింది. అందుకే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సైతం రంగంలోకి దించారు. ఇలా లోయలో పడ్డ బస్సు నుంచి క్షతగాత్రులతో పాటు చనిపోయిన ముగ్గురు ప్రయాణికులు మృతదేహాలను బయటకు తీసుకు వచ్చారు.
అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న 15 అంబులెన్సుల ద్వారా క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి పంపించారు. అలాగే మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్సపొందతూ మరో వ్యక్తి మృతి చెందాడు. ఇలా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మొత్తం 21 మంది చికిత్స పొందుతుండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రమాదానికి గురైన బస్సు పూర్తిగా ధ్వంసం అయిపోయింది.
ప్రమాదం విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. అలాగే గాయాల పాలైన వారి కోసం ఎయిమ్స్ రిషికేష్ నుంచి వైద్యులను హల్ద్వారీకి పంపినట్లు వివరించారు. తాను ప్రతీక్షణం ఘటనకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకుంటున్నానని ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు.