పిల్లల ఉన్నత చదువులు, వారి పెళ్లిళ్లు, పదవీ విరమణ వంటి కీలకమైన ఆర్థిక లక్ష్యాల కోసం పొదుపు లేదా పెట్టుబడులు చేస్తుంటారు. అయితే తమ పెట్టుబడి ఆర్థిక అవసరాలకు తగినంత రాబడి ఇస్తోందో లేదోనని మదన పడుతారు. పెట్టుబడి పెట్టిన డబ్బు రెట్టింపు అవడానికి ఎంత సమయం పడుతుంది అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. అలాంటి వారు తమ డబ్బులు ఎన్నేళ్లకు రెండింతలు, లేదా మూడింతలు అవుతాయని ముందే తెలుసుకోవచ్చు. అందుకు మ్యాథమేటికల్ మెథడ్స్, ఫార్ముల్స్ ఉన్నాయి. రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ. 10 లక్షలు, రూ. 15 లక్షలు అయ్యేందుకు ఈ ఫార్ములాస్ ద్వారా తెలుసుకోవచ్చు. తమ డబ్బులు రెండింతలు లేదా మూడింతలు అయ్యేందుకు ఎన్నేళ్లు పడుతుందని చాలా సులభంగా తెలుసుకునేందుకు ఓ థంబ్ రూల్ ఉంది. అదే రూల్ ఆఫ్ 72, మూడింతలు అయ్యేందుకు రూల్ ఆఫ్ 114 ఉపయోపడతాయి.
రూల్ 72 ఎలా పని చేస్తుంది?
మీ పెట్టుబడి ఎన్ని రోజుల్లో రెండింతలు అవుతుందని రూల్ ఆఫ్ 72 ఉపయోగించి తెలుసుకోవచ్చు. మీ పెట్టుబడిపై వచ్చే వార్షిక వడ్డీ రేటుతో 72ను భాగించాల్సి ఉంటుంది. ఆ వచ్చే సంఖ్య ఆధారంగా మీ పెట్టుబడి డబుల్ అయ్యేందుకు ఎన్నేళ్లు పడుతుందని తెలుస్తుంది. ఉదాహరణకు మీరు రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టారు అనుకుందాం. దానిపై వార్షిక వడ్డీ రేటు 8 శాతంగా ఉంటే.. అప్పుడు 72 సంఖ్యను 8తో భాగించాలి. అంటే 72/8= 9 వస్తుంది. అంటే మీ పెట్టుబడి రూ.5 లక్షలు 9 ఏళ్ల తర్వాత రూ. 10 లక్షలు అవుతుంది.
రూ. 5 లక్షలు మూడింతలు ఎప్పుడవుతుంది?
రూల్ 72 మాదిరిగానే రూల్ ఆఫ్ 114 ఉంటుంది. దీని ద్వారా మీ పెట్టుబడి మూడింతలు పెరుగేందుకు ఎన్ని రోజులు పడుతుందో తెలుసుకోవచ్చు. మీరు రూ. 5 లక్ష ఇన్వెస్ట్ చేస్తే.. మీ వార్షిక వడ్డీ రేటు 12 శాతంగా ఉందని అనుకుందాం. అప్పుడు మీరు 114ను 12తో భాగించాలి. అంటే 114/12= 9.5 వస్తుంది. దీని ప్రకారం మీ రూ. 5 లక్షలు రూ. 15 లక్షలు కావాలంటే 9.5 సంవత్సరాల టైం పడుతుంది.