ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరేళ్ల చిన్నారిపై విరుచుకుపడ్డ వీధి కుక్కలు.. స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన బాలిక

national |  Suryaa Desk  | Published : Wed, Dec 25, 2024, 07:04 PM

రోజురోజుకూ వీధి కుక్కల దాడులు ఎక్కువ అవుతున్నాయి. శునకాల దాడిలో అనేక మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతుండగా.. మరెంతో మంది తీవ్ర గాయాల పాలవుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ సమస్య ఎదుర్కుంటుండగా.. తాజగా ఒడిశాకు చెందిన ఓ బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. పొలంలో ఆడుకుంటున్న బాలికపైకి ఒక్క ఉదుటున దూకి మరీ ఆమె కరిచాయి. ఎక్కడికక్కడ శరీరం ముక్కలు చేశాయి. శునకాల దాడిలో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని చూసిన స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ విశేషాలు మీకోసం..!


ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక చాందిని హరిజన్.. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో తన అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి వెళ్లాలనుకుంది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు కూడా ఓకే చెప్పారు. ఆమెతో పాటు ఆమె సోదరుడిని కూడా అమ్మ, తాతయ్యల ఊరు ఫూప్‌గావ్‌కు తీసుకువెళ్లారు. వారిని అక్కడే విడిచి పెట్టి తల్లిదండ్రులు ఇంటికి వెళ్లిపోయారు. అయితే అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉన్న ఆ చిన్నారులు మాత్రం వారితో హాయిగా గడుపుతున్నారు.


అమ్మమ్మ వండిపెట్టినవ్వనీ కడుపునిండా తినేస్తూ.. ఫుల్లుగా ఆడుకుంటున్నారు. అయితే మంగళవారం రోజు మధ్యాహ్నం కూడా అలాగే తినేసి వెళ్లిన చిన్నారులు.. ఇంటికి దగ్గర్లో ఉన్న పొలంలో ఆడుకుంటున్నారు. ఇంటికి దగ్గరే ఉండడంతో అమ్మమ్మ, తాతయ్యలు కూడా వారిని ఏమీ అనలేదు. చిన్నారులు ఇద్దరూ ఆడుకుంటున్న సమయంలోనే అక్కడకు ఐదారు కుక్కలు వచ్చాయి. అది గుర్తించని చిన్నారులు ఆటను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంతలోనే కుక్కలు అన్నీ ఒక్కసారిగా వారిని చూసి అరవడం ప్రారంభించాయి. వారు పారిపోయే ప్రయత్నం చేయగా.. బాలికను కుక్కలు పట్టుకున్నాయి. బాలుడు మాత్రం దూరంగా పరిగెత్తాడు.


తన చెల్లిని కుక్కలు పట్టుకోవడం చూసి ఆమెను కాపాడబోయాడు. కానీ ఆ కుక్కలు అతడిపైకి కూడా రావడంతో భయంతో వెనక్కి తగ్గాడు. వెంటనే ఆ విషయాన్ని తన అమ్మమ్మ, తాతయ్యలకు చెప్పాలని ఇంటికి పరిగెత్తాడు. ఎవరూ లేకపోవడంతో కుక్కలు చెలరేగిపోయాయి. చిన్నారిని ఇష్టం వచ్చినట్లుగా కొరుకుతూ.. శరీర భాగాలను వేరు చేశాయి. బాలుడి ద్వారా విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే.. కుక్కలు చిన్నారిని పూర్తిగా చిదిమేశాయి. తీవ్ర గాయాలతో రక్తం ధారపాతంగా కారుతున్న చిన్నారిని చూసిన వాళ్లు కంటతడి పెట్టారు. భయంభయంగానే ఆమె దగ్గరకు వెళ్లారు.


కానీ అప్పటికే చాందిని మృతి చెందింది. విషయం గుర్తించిన స్థానికులు బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం చాందిని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి పంపించారు. మరోవైపు బాలిక తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్యలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంత ఘోరంగా ఆ కుక్కలు చాందినిపై దాడి చేసి తీరును తలుచుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆ చిన్నారి మృతదేహాన్ని చూస్తూ.. ముట్టుకోవడానికి కూడా గజగజా వణికిపోయారు. బిడ్డలను చివరగా తాకలేని పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ శోకాలు పెట్టారు.


ఒడిశాలో గత రెండేళ్లలో 5 లక్షల మంది కుక్కకాటుకు కేసులు నమోదు అయినట్లు పోలీసులు చెబుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 1.7 మిలియన్ వీధి కుక్కులు ఉన్నాయని.. పెరుగుతున్న ఈ ముప్పపును పరిష్కరించడంలో అధికారులు విఫలం అయ్యారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర సర్కారు మేలుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com