కెనడా అమెరికా సరిహద్దుల్లో మానవ అక్రమ రవాణాతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో కొన్ని కెనడియన్ కాలేజీలు, భారతీయ సంస్థల ప్రేమయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ప్రారంభించింది. 2022 సంవత్సరం జనవరి 19వ తేదీన గుజరాత్‌లోని దింగుచా గ్రామానికి చెందిన నలుగురు సభ్యుల భారతీయ కుటుంబం చట్టవిరుద్ధంగా కెనడా సరిహద్దు నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేసింది. అదే సమయంలో విపరీతమైన చలి ఉండగా.. ఆ కుటుంబం అంతా ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసును ఆధారంగా చేసుకుని ఈడీ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయినా భవేష్ పటేల్‌తో పాటు మరికొందరిపై కూడా మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. నిందితుడు భవేష్‌తో పాటుగా మరికొంత మంది కెనడా నుంచి అక్రమంగా అమెరికాలోకి భారతీయులను తరలించేందుకు ఓ అద్భుతమైన ప్రణాళికను వేసినట్లు తెలుసుకుంది. ముఖ్యంగా కెనడా, అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని, విదేశాల్లోనే స్థిరపడాలని కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ నిందితులు అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
వ్యక్తులను అక్రమంగా అమెరికా పంపేందుకు ఒక్కొక్కరి వద్ద నుంచి 55 లక్షల రూపాయల నుంచి 60 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు కూడా ఈడీ అధికారులు తెలుసుకున్నారు. విద్యార్థి వీసాలపై కెనడాకు వెళ్లిన వారు అక్కడి విశ్వవిద్యాలయాల్లో చేరకుండా అక్రమంగా కెనడా సరిహద్దు మీదుగా ఆమెరికా వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయం తెలియని కాలేజీలు.. వ్యక్తుల నుంచి వారు తీసుకున్న అడ్నిషన్ ఫీజును తిరిగి ఆయా కాలేజీలు వ్యక్తుల ఖాతాల్లో జమ చేసేవారని వివరించారు.
డిసెంబర్ 10, 19వ తేదీల్లో ముంబయి, నాగ్‌పూర్, గాంధీ నగర్, వడోదర సహా ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈక్రమంలోనే విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రేవేశాలను సులభతరం చేసేందుకు పని చేస్తున్న రెండు సంస్థలను అధికారులు గుర్తించారు. అందులో కటి ముంబయిలో ఉండగా మరోటి నాగ్‌పూర్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు. మొత్తంగా ఈ సంస్థలు ఏటా 35 వేల మంది భారతీయ విద్యార్థులను విదేశాల్లోని కళాశాలలకు సూచిస్తాయని వెల్లడించారు.
అలాగే దేశవ్యాప్తంగా 3 వేల 500 మంది ఏజెంట్లను గుర్తించగా.. అందులో 1700 మంది గుజరాత్‌లోనే ఉండడం గమనార్హం. దాదాపు 800 మంది చురుకుగా ఉండి ఇలా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అయితే ఈ సంస్థలు 112 కెనడియన్ కాలేజీలతో ఒప్పందం పెట్టుకున్నట్లు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఈక్రమంలోనే వాటిపై నిఘా పెట్టారు.