భారతదేశ మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల పితామహుడు మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యం పాలై గురువారం రోజు ప్రాణాలు కోల్పోయారు. ఈక్రమంలోనే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు అంతా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దేశ ఆర్థిక పరిస్థితులను మార్చిన ఈయన ప్రస్తుత ఆర్థిక స్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని తెగ ఉబలాట పడుతున్నారు. అందుకోసం గూగుల్ ఓపెన్ చేసి మన్మోహన్ సింగ్ ఆస్తుల విలువ ఎంత అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన పూర్తి ఆస్తుల వివరాలు మీకోసం. ఓ లుక్కేయండి.
2004 సంవత్సరం నుంచి 2014 వరకు అంటే పదేళ్ల పాటు భారత దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్.. చాలా సింపుల్‌గా ఉండేవారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా.. సాధారణ మధ్య తరగతికి చెందిన వాడిగానే ప్రవర్తించేవారు. అనేక సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. ఈయన కూడబెట్టింది చాలా తక్కువే. ఇప్పటి వరకు మొత్తంగా మన్మోహన్ సింగ్ ఆయన సతీమణి గురుశరణ్ కౌర్ దంపతుల మొత్తం ఆస్తి విలువ 15 కోట్ల 77 లక్షలు.
రాజ్యసభలో తన నామినేషన్ కోసం నివేదించిన అఫిడవిట్ ప్రకారం.. మన్మోహన్ సింగ్‌కు చండీగఢ్‌లోని సెక్టార్ 11బీలో ఒక ఇల్లు ఉండగా.. ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో మరో ఇల్లు ఉంది. 11 ఏళ్ల క్రితం ఈ రెండు ఇళ్ల విలువ రూ.7.27 కోట్లు. అంతేకాకుండా మన్మోహన్ సింగ్ ప్రకటించిన ఇతర ఆస్తుల్లో 30 వేల రూపాయల నగదు తన వద్ద ఉండగా.. మరో 7 కోట్ల రూపాయలను తన బ్యాంక్ అకౌంట్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నట్లు తెలిపారు. అలాగే ఆయన భార్య గురుశరణ్ కౌర్ వద్ద మొత్తం 150 గ్రాముల బంగారం ఉందని వివరించారు. ఇవి మాత్రమే కాకుండా పోస్టల్ సేవింగ్ స్కీమ్‌లలో రూ.12.76 లక్షలు ఉన్నాయని స్పష్టం చేశారు.
అయితే మన్మోహన్ సింగ్‌కు ఎలాంటి అప్పులు లేవు. రుణాలు తీసుకోవడానికి మన్మోహన్ సింగ్ ఏమాత్రం ఆసక్తి చూపించేవారు కాదని చాలా మంది చెబుతుంటారు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులు మెచ్యూర్ కాగానే.. మళ్లీ వాటన్నిటినీ తిరిగి ఇన్వెస్ట్ చేసేవారని సమాచారం. 2019 వరకు 15 కోట్లుగా ఉన్న ఆస్తి ఇప్పుడు 15 కోట్ల 77 లక్షలకు చేరుకోవడానికి కూడా కారణం ఇదేనట. ముఖ్యంగా మ్యూజువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లలో డబ్బులు పెట్టడం ఏమాత్రం ఇష్టపడని ఆయన.. సాధారణ మధ్యతరగతికి చెందిన వాళ్లు చేసే పద్ధతిలోనే సేవ్ చేయడం గమనార్హం.