మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ గురించి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అనారోగ్య కారణాలతో మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని మరణంతో దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల నడుమ మన్మోహన్ సింగ్.. తమ కుటుంబం పట్ల చూపించిన దయ, ఆయన విశాల హృదయం గురించి గుర్తుకు వస్తోందంటూ నారా లోకేష్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న సమయంలో జరిగిన ఓ ఘటనను నారా లోకేష్ గుర్తు చేసుకున్నారు.
"2004 సంవత్సరం మాకు చాలా కష్టమైన సమయం. తిరుపతి సమీపంలో నక్సల్స్ పేల్చిన బాంబు పేలుడు నుంచి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడే కోలుకున్నారు. ఇక 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఈ కీలక సమయంలో, కొత్తగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుకు భద్రతను తగ్గించే ప్రయత్నం చేసింది. చంద్రబాబు ప్రజలతో కలవకుండా, వారి సమస్యలపై పోరాటం చేయకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ పనికి సిద్ధమైంది. ఈ సమయంలో చంద్రబాబు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిశారు. తనపై జరిగిన దాడుల గురించి వివరించారు. అలాగే తనకు ముప్పు ఉందంటూ భద్రతా సంస్థల నివేదికలను చూపించి భద్రతను పునరుద్ధరించాలని వ్యక్తిగతంగా మన్మోహన్ సింగ్‌ను కలిసి కోరారు." అంటూ నారా లోకేష్ ట్వీ్ట్ చేశారు.
అయితే తమది ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ.. ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ అవేవీ పట్టించుకోలేదని నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు దేశానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా చెప్తూ.. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా చంద్రబాబుకు భద్రతను పునరుద్ధరించాలని (ఎన్ఎస్‌జీ కమాండోలతో) ఆదేశించారని గుర్తు చేసుకున్నారు. అలాగే చంద్రబాబు గారు.. మీరు హైదరాబాద్ వెళ్లండి.. మీరు హైదరాబాద్ చేరుకునేసరికి ఎన్ఎస్‌జీ సెక్యూరిటీ మీకోసం సిద్ధంగా ఉంటుందని.. మన్మోహన్ సింగ్ అప్పట్లో చెప్పారంటూ నారా లోకేష్ గుర్తు చేసుకున్నారు. డా. మన్మోహన్ సింగ్ ఒక అరుదైన రాజనీతిజ్ఞుడు అని.. ఆయన విశాల హృదయానికి మా కుటుంబం మొత్తం వ్యక్తిగతంగా రుణపడి ఉంటామంటూ.. మిమ్మల్ని మిస్ అవుతున్నాం సర్ అంటూ నారా లోకేష్ ట్వీ్ట్ చేశారు. మరోవైపు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు.