బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆల్‌రౌండర్‌గా నితీశ్ అద్భుతంగా రాణిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఇలాంటి యువ క్రికెటర్లను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని.. నేటి యువతకు నితీశ్ రోల్ మోడల్ అన్నారు. దేశంలోనే అత్యాధునిక వసతులతో కూడిన స్టేడియంను అమరావతిలో నిర్మిస్తామని పేర్కొన్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడే విధంగా విశాఖపట్నం స్టేడియంను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఐపీఎల్ టీమ్ సిద్ధం చేసేలా ఏసీఏ ఆలోచన చేస్తోందన్నారు.
ఆస్ట్రేలియా గడ్డపై అదరగొడుతున్న తెలుగు తేజం, యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో సత్తాచాటిన సంగతి తెలిసిందే. ఈ టెస్టు సిరీస్ ద్వారానే నితీష్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో వాషింగ్టన్ సుందర్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నమోదు చేసిన నితీష్ కుమార్ రెడ్డి.. ఈ క్రమంలోనే ఫస్ట్ సెంచరీ నమోదు చేశాడు.
ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ కొట్టిన నితీష్ కుమార్ రెడ్డిని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అభినందించారు. నితీష్ కుమార్ రెడ్డి స్వస్థలం విశాఖపట్నం అని తెలిసిన సంగతే. ఈ క్రమంలో అభినందనలు తెలియజేసిన చంద్రబాబు.. టెస్టులలో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన మూడో భారతీయ ఆటగాడు.. నితీష్ కుమార్ రెడ్డి కావటం మరింత సంతోషం కల్గిస్తోందన్నారు. రంజీల్లో ఆంధ్రా జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించారని.. అండర్ 16లో సైతం అద్భుత విజయాలు అందుకున్నారన్నారు. నితీష్ కుమార్ రెడ్డి భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
మరోవైపు నితీష్ కుమార్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ సైతం అభినందనలు తెలిపారు. విశాఖ కుర్రాడు నితీష్‌కుమార్‌రెడ్డి ఆసీస్‌పై అద్భుత శతకం చేశారని.. ఒత్తిడిలోనూ చక్కగా రాణించారని.. నితీష్ కుమార్ రెడ్డి ధైర్యం, పట్టుదల, సంకల్ప శక్తిని చూసి గర్విస్తున్నామంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇక నితీష్ కుమార్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ బహుమతి ప్రకటించింది. క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి రూ.25 లక్షలు నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్ని ప్రకటించారు.
నితీష్ కుమార రెడ్డికి అభినందనలు తెలిపిన ఏసీఏ ప్రెసిడెంట్.. త్వరలోనే సీఎం నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా నితీష్‌కు రూ.25 లక్షలు నగదు బహుమతిని అందిస్తామని ప్రకటించారు. అలాగే దేశంలోనే అత్యాధునిక స్టేడియాన్ని అమరావతిలో నిర్మిస్తామని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఐపీఎల్ మ్యాచ్‌లను వైజాగ్ లోనూ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని.. ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఐపీఎల్ టీమ్ ఉండేలా ఆలోచిస్తున్నామని కేశినేని చిన్ని తెలిపారు.