తక్కువ స్థాయి పన్ను వివాదాలను సులభంగా పరిష్కరించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వివాద్ సే విశ్వాస్’ స్కీమ్ గడువును ఆదాయ పన్ను విభాగం పొడిగించింది. నిజానికి ఇవాళ్టితో (2024 డిసెంబర్ 31) ఈ స్కీమ్ డెడ్‌లైన్ ముగియాల్సి ఉంది. అయితే, మరో 15 రోజులపాటు చెల్లింపుదార్లకు అవకాశం కల్పించింది. 2025 జనవరి 15 వరకు గడువును పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. తక్కువ స్థాయి పన్ను వివాదాల పరిష్కారం కోసం ఈ పథకాన్ని కేంద్ర బడ్జెట్ 2024లో ప్రభుత్వం ప్రకటించింది. వివాదాస్పద పన్నులో 10 శాతం లేదా వడ్డీలో 25 శాతం ఆలస్య జరిమానా చెల్లించి సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలు కల్పించింది. గడువు తేదీ దాటిన తర్వాత, అంటే 2025 ఫిబ్రవరి 1 నుంచి పన్నులో 110 శాతం లేదా వడ్డీలో 30 శాతం చెల్లించి వివాదాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.