గత ప్రభుత్వ హాయంలో తిరుమలను దోచేశారని తిరుమల తిరుపతి దేవస్థానమ్ (టీటీడీ) పాలక మండలి సభ్యుడు.. బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా తిరుమలను దోపిడీ చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ఖజానాకే రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. కొండపై అక్రమాలకు పాల్పడ్డారని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని పేర్కొన్నారు. భక్తులు సమర్పించిన కానుకలను తమ సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు. శ్రీవారి పరకామణి లో రూ. 100 కోట్ల స్కామ్ జరిగిందని, సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పరామణిలో జరిగిన కుంభకోణంపై డీజీపీ తిరుమలరావుకు ఆయన ఇప్పటికే ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. టీటీడీ పరకామణిలో డాలర్లు మాయం అయ్యాయని, ఆ ఘటనపై విచారణ చేయాలని డీజీపీని కోరినట్లు ఆయన తెలిపారు.