ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ చదివే విద్యార్థులకు జనవరి 1వ తేదీ నుంచి కొత్త పథకాన్ని అమలు చేయనుంది. ప్రభుత్వ ఇంటర్ విద్యార్థులకు నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి జీవోను విడుదల చేసింది.
ఇక రాష్ట్రంలో పేదరికం కారణంగా విద్యార్థులు చదువుకు దూరం కావద్దని ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకువచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నారు. దీంతో ఏపీలో ఉన్న 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రేపటి నుంచి కొత్త సంవత్సరం కానుకగా ఇంటర్ విద్యార్థులకు.. మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ మధ్యాహ్న భోజన పథకానికి మొత్తం రూ. 115 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
మధ్యాహ్న భోజన పథకం అమలుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్.. మంగళవారం జీవో ఎంఎస్ నెంబర్ 40ను జారీ చేశారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న.. పేదరికంలో ఉన్న ప్రభుత్వ ఇంటర్ విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఇక ఈ మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఇంటర్ విద్యార్థులకు పౌష్టికాహరం అందించడంతో పాటు ఆరోగ్యం, అన్ని విధాల అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందడంతో పాటు.. కాలేజీల్లో హాజరు శాతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే ఈ పథకం అమలు కోసం మొదట రూ.29.39 కోట్ల బడ్జెట్ ప్రభుత్వం కేటాయించింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి మరో రూ. 85.84 కోట్లు కేటాయిస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఇంటర్ విద్య డైరెక్టర్, మధ్యాహ్న భోజన కార్యక్రమం డైరెక్టర్‌లు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో పాటు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన గైడ్ లైన్స్‌ను కూడా విడుదల చేసింది.