మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీని అరెస్ట్ అయ్యాడు. కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీని పోలీసులు అరెస్ట్ చేశారు.అ సోంలో కాళీని గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడ తెలుగు దేశం పార్టీ కార్యాలయం, ఆ పార్టీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడి కేసులో కాళీని నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కాళీ కీలక సూత్రధారిగా గుర్తించిన పోలీసులు.. అతడిపై ఇఫ్పటికే కేసు నమోదు చేశారు. ఈ కేసులో 13 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. వారంతా రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా కాళీని గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు దేశం పార్టీ నేతలు గుడివాడలో 2022 డిసెంబరు 26న పలుచోట్ల వంగవీటి రంగా వర్ధంతి నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
డిసెంబరు 25న మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుకు కాళీ ఫోన్ చేసి టీడీపీ ఆధ్వర్యంలో రంగా వర్ధంతి నిర్వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.. తాము ఆ కార్యక్రమాన్ని నిర్వహించి తీరతామని చెప్పడంతో.. కాళీ చంపేస్తానని బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై 2022 డిసెంబర్ 25న కొడాలి నాని అనుచరులు పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడ టీడీపీ కార్యాలయానికి నిప్పంటించబోతుండగా వెంటనే పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.
ఈ ఘటనపై గత ప్రభుత్వ హయాంలో చర్యలు తీసుకోకపోవడంతో.. ఇటీవల మళ్లీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నాని అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.. వీరిపై 143, 144, 145, 188, 427, 506, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నాని అనుచరుల్ని ఇటీవల అరెస్ట్ చేయగా.. ప్రధాన అనుచరుడు కాళీ మాత్రం దొరకలేదు.. తాజాగా అసోంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కొడాలి నాని పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.