విజయవాడవాసులకు ముఖ్యమైన గమనిక.. ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర 'నో హెల్మెట్-నో ఎంట్రీ' పేరుతో సరికొత్త రూల్ అమలు చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా గుంటూరు వైపు వెళ్లే ద్విచక్ర వాహనదారుల్ని బ్యారేజీ దగ్గర అనుమతి నిరాకరించారు. హైకోర్టు ఆదేశాలతో రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ కృష్ణమూర్తి నాయుడు తెలిపారు. ప్రతి పౌరుడి రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీ దగ్గర ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. మహానాడు, బీఆర్టీఎస్ రోడ్డు, వారధి ఫ్లై ఓవర్, అజిత్ సింగ్ నగర్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఈ రూల్స్‌ను అమలు చేస్తున్నారు. ప్రజలకు హెల్మెట్ విషయంలో అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని కోరుతున్నారు
అంతేకాదు నగరంలో ప్రతి రోజూ వాహనదారులను తనిఖీ చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు తనిఖీల కోసం ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసుల సేవల్ని కూడా ఉపయోగించనున్నారు. ఎవరైనా హెల్మెట్ లేకుండా వస్తే.. వారికి జరిమానా విధించడంతో పాటుగా పదేపదే ఉల్లంఘించిన వారి వాహనాలను సీజ్ చేశారు. అప్పటికి తప్పు చేస్తే లైసెన్స్ కూడా రద్దు చేస్తారు. అలాగే మూడు చలానాలకు మించి ఉంటే డ్రైవింగ్ లైసెన్స్‌ను పోలీసులు సస్పెండ్ చేయడానికి రవాణా శాఖాధికారికి లేఖ రాస్తారు. అంతేకాదు పెండింగ్ చలానాలను మూడు నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది.. లేకపోతే వాహనాన్ని సీజ్ చేస్తారు.
మరోవైపు న్యూ యర్ సందర్భంగా విజయవాడలో ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. సెలబ్రేషన్స్ చేసుకునే వారు పశ్చిమ బైపాస్‌పైకి అనుమతి లేదని.. ఎవరూ వెళ్లొద్దని ఆదేశించారు. అలాగే బెంజ్ సర్కిల్ రెండు ఫ్లై ఓవర్లు, పీసీఆర్ దగ్గర ఉన్న ప్లై ఓవర్, కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఏలూరు రోడ్డు, బీఆర్జీఎస్ రోడ్డు, ఎంజీ రోడ్లను
మూసివేస్తున్నట్లు చెప్పారు. బైకుల సైలెన్సర్లు తీసి ఎక్కువ శబ్దం వచ్చేలా చేస్తూ.. బైక్‌లపై స్టంట్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైక్‌లు నడిపివేవాళ్లు హెల్మెట్ లేకుండా ప్రకాశం బ్యారేజీపైకి వస్తే అనుమతి లేదన్నారు.. హెల్మెట్ ఉంటేనే ప్రకాశం బ్యారేజీ పైకి అనుమతిస్తామన్నారు. ఈ నిబంధన సోమవారం నుంచి అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.. హెల్మెట్ లేక అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయనే కారణంతో ఈ రూల్ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.