2024 ఏడాది ఆటోమొబైల్ ఇండస్ట్రీకి మెరుగైన ఫలితాలు దక్కాయి. అనేక వాహన తయారీ సంస్థలు తమ సేల్స్‌తో అదరగొట్టాయి. 2024ను స్పోర్ట్స్ యుటిలిటీ వెహెకిల్స్ నామ సంవత్సరంగా అభివర్ణించవచ్చు.అంతలా.. వినియోగదారులను ఎస్‌యూవీలు ఆకట్టుకున్నాయి. చిన్న ఎస్‌యూవీలు సైతం మంచి ఫలితాలు రాబట్టాయి. ఈ సెగ్మెంట్లో దిగ్గజ సంస్థ టాటా.. మరోసారి తనకు తిరుగలేదని నిరూపించింది. ఈ సంస్థ నుంచి టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ సేల్స్‌లో కొత్త రికార్డు సృష్టించింది. ఎకానమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. 2024లో బేస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.2023లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ బెస్ట్ సెల్లింగ్ కారు హోదాను దక్కించుకోగా.. 2024లో ఆ రికార్డును పంచ్ చెరిపేసి తన పేరిట తిరగరాసింది. 2023 లెక్కల ప్రకారం... 2,03,469 స్విఫ్ట్ కార్ల అమ్మకాలు జరిగాయి. అయితే.. 2024లో మాత్రం స్విఫ్ట్ తేలిపోయింది. ఇక టాటా పంచ్ విషయానికి వస్తే... 2024లో 2,00,678 కార్ల అమ్మకాలతో నంబర్ వన్‌గా నిలించింది. 2023లో టాటా పంచ్ ఏడో స్థానంలో నిలవడం గమనార్హం.
ఇక 2024లో మారుతీ WagonR హ్యాచ్‌బ్యాక్ తన అమ్మకాలతో రెండో స్థానంలో నిలించింది. 1,87,200 యూనిట్ల అమ్మకాలు ఈ ఏడాదిలో జరిగాయి. ఇక హ్యూందాయ్ సంస్థ నుంచి పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటా మోడల్ కారు 1,83,782 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచింది. మారుతీ ఎర్టిగా 1,83,762 అమ్మకాలతో నాలుగో స్థానంలో, మారుతీ బ్రెజా 1,83,718 యూనిట్ల అమ్మకాలతో ఐదో స్థానంలో నిలిచాయి.స్విఫ్ట్, బాలెనో, మహీంద్రా స్కార్పియో, మారుతీ ఫ్రాంచైజ్, టాటా నెక్సాన్ తర్వాతి వరుసలో చోటు దక్కించుకున్నాయి. టాటా నెక్సాన్ అమ్మకాలను పరిశీలిస్తే 2024లో 1,56,770 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఏదేమైనా గతేడాది ఐదో స్థానంలో నిలిచిన టాటా పంచ్ మాత్రం...ఈసారి ఫస్ట్ ప్లేస్‌లో చోటు దక్కించుకోవడం విశేషం. 2021లో లాంఛ్ అయిన టాటా పంచ్.. క్రమక్రమంగా తన సేల్స్ పెంచుకుంటూ...మార్కెట్లో పోటీ పెంచుతోంది.
టాటా పంచ్‌లో ఉన్న వివిధ పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ కూడా దీని సేల్స్ పెరగడానికి మరో కారణం అని చెప్పవచ్చు. పంచ్ మోడల్ పెట్రోల్, సీఎన్‌జీతో సహా ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. 2023 మోడల్ వాహనాల స్టాక్ క్లియరెన్స్ కోసం అందించిన డిస్కౌంట్ ఆఫర్ కూడా టాటా పంచ్ వాహనాల అమ్మకాలను మరింత పెంచాయి.టాటా పంచ్... 1.2 లీటర్ రెవోట్రాన్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. ఇది 6000rpm వద్ద 86పీఎస్, 3,300rpm వద్ద 113Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు.. 5 స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ ట్రాన్సిమిషన్ ఆప్షన్స్‌తో లభిస్తోంది. మ్యాన్యువల్ వర్షన్ పంచ్.. 18.97kmpl మైలేజీ అందిస్తుండగా.. ఆటోమేటిక్ వర్షన్ 18.82kmpl మైలేజీ ఇస్తోంది. పంచ్ సీఎన్‌జీ వర్షన్ మాత్రం ఏకంగా 26.99kmpl మైలేజీ అందించగలదని టాటా సంస్థ చెబుతోంది.
టాటా పంచ్ 7 అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్టుమెంట్ క్లస్టర్, ఆటో ఏసీ, ఆటోమేటిక్ హెడ్ లైట్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో అందుబాటులో ఉంది. అంతేగాకుండా... పంచ్ మోడల్ భారత్‌లో ఒక సేఫెస్ట్ కారుగా నిలిచింది. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఈ కారు.. 5 స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది.
ఈ సంస్థ కార్ల ధరలు కేవలం రూ.6.13 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. అలాగే తమ కార్లకు సంబంధించి ఫీచర్లను ఎప్పటికప్పడు అప్డేట్ చేస్తుండడం కూడా.. కస్టమర్స్ ఈ కార్లను కొనుగోలు చేయడానికి మరో కారణంగా చెప్పవచ్చు. టాటా పంచ్ ఈవీ విషయానికి వస్తే... ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఇది ఏకంగా 421 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.