ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల 8న ప్రధాని విశాఖ రానున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్ ఫిక్స్ అయింది. అనేక కార్యక్రమాలతో పాటుగా బహిరంగ సభలోనూ ప్రధాని మోదీ పాల్గొంటున్నారు.కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న ఈ సమయం లో ఏపీ కేంద్రంగా ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో ఏపీకి సహకారం అందుతున్న వేళ ఈ పర్యటనలో ప్రధాని పాల్గొంటున్న కార్యక్రమాలు ఏపీ భవిష్యత్ కు కీలక మలుపుగా మారనున్నాయి.ప్రధాని మోదీ ఈ నెల 8న విశాఖ లో పర్యటన షెడ్యూల్ విడుదలైంది. 8వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఆయన నగరంలో ఉంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో ఎన్‌టీపీసీ నిర్మించనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటుకు శంకుస్థాపన, రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేసే కార్యక్రమాలను సభా వేదిక నుంచి చేపడతారు. ప్రధాని పర్యటనకు ముందే సీఎం చంద్రబాబు విశాఖకు వస్తున్నారు
ఈ నెల 4న నిర్వహించనున్న నేవీ డే పరేడ్‌కు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమాల్లో సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ సైతం పాల్గొంటారు. బహిరంగ సభలో సీఎం చంద్రబాబు, పవన్ మాట్లాడిన తరువాత ప్రధాని కీలక ప్రసంగం చేయనున్నారు. మూడో సారి అధికారంలోకి వచ్చిన తరువాత గతం కంటే భిన్నంగా మోదీ ప్రభుత్వం ఏపీకి పలు రంగాల్లో సహకారం అందిస్తోంది. అమరావతి, పోలవరం పైన ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారు. రూ 15 వేల కోట్ల రుణం అమరావతికి.. అదే విధంగా పోలవరం మొదటి దశ నిర్మాణం పూర్తికి కేంద్రం నుంచి నిధులు మంజూరు అయ్యాయి. అదే విధంగా ఇప్పుడు రైల్వే జోన్ కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
అమరావతి నుంచి కొత్తగా రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. అదే విధంగా జాతీయ రహ దారుల విషయంలోనూ ప్రాధాన్యత ఇచ్చింది. ఇక, కొత్తగా ఏపీకి పరిశ్రమల ఏర్పాటులోనూ కేంద్రం సహకారం అందిస్తోంది. ఇప్పుడు రాజకీయంగానూ ఏపీలో బలోపేతం పైన ప్రధాని మోదీ ఫోకస్ చేసారు. అందులో భాగంగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూనే బీజేపీ నేతలు కొత్త వ్యూహాలతో ఏపీ లో అడుగులు వేస్తున్నారు. ఇక, పవన్ పైన ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభిమానం చూపిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ కేంద్రంగా జరిగే సభలో ప్రధాని మోదీ సమక్షంలో పవన్ ప్రసంగం పైన ఆసక్తి నెలకొంది. ప్రధాని పర్యటన కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.