ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకప్పుడు కూలీ, ఇప్పుడు లాటరీ కింగ్‌.. ఏటా రూ.15వేల కోట్ల టర్నోవర్.. ఈడీ దర్యాప్తులో సంచలనం

national |  Suryaa Desk  | Published : Fri, Jan 03, 2025, 08:12 PM

లాటరీ కింగ్‌ శాంటియాగో మార్టిన్‌.. వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ అధికారుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ఎలక్షన్ బాండ్ల సమాచారం బయటికి వచ్చి సమయంలో లాటరీ కింగ్ శాంటియాగో మార్టినే పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. వివిధ పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో ఈ లాటరీ కింగ్‌ శాంటియాగో మార్టిన్‌.. ఏకంగా 5 ఏళ్లలోనే రూ.1300 కోట్లు వివిధ రాజకీయ పార్టీలకు అందించాడు. ఇదంతా లాటరీ బిజినెస్‌తో సంపాదించిందే కావడం గమనార్హం. అయితే లాటరీ బిజినెస్‌లో మోసాలకు పాల్పడి వేల కోట్ల సంపదను కూడబెట్టినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఒక్క ఏడాదిలోనే రూ.15 వేల కోట్లు సంపాదించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తులో వెల్లడైంది. ఈడీ దాడులతో శాంటియాగో మార్టిన్ ఆస్తులు, మోసాలు మొత్తం వెలుగులోకి వచ్చాయి.


ఫ్యూచర్‌ గేమింగ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థను స్థాపించిన శాంటియాగో మార్టిన్‌.. లాటరీల పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో 2014లో దీనిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత 2018లో శాంటియాగో మార్టిన్‌ సహా ఆయన బంధువులు, ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్‌లో పనిచేసిన ఉద్యోగులపై ఈడీ అధికారులు మనీలాండరింగ్‌ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఇటీవల అతడి రూ.1000 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఈ క్రమంలోనే మరింత లోతైన దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు బయటికి వచ్చాయి.


లాటరీ బిజినెస్‌లో వచ్చిన అక్రమ సొమ్ముతో ఆస్తులు కొనేందుకు శాంటియాగో మార్టిన్‌ ఏకంగా 350కి పైగా బోగస్ కంపెనీలను ప్రారంభించినట్లు తేలింది. అంతేకాకుండా ఎన్నో కార్లు కొనుగోలు చేశాడు. లాటరీ టికెట్లు కొనే వారికి కచ్చితంగా లాటరీ తగిలే టికెట్లను విక్రయించి.. వారి నుంచి ఆస్తులను కొనుగోలు చేసేవాడని దర్యాప్తులో ఈడీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా.. తన బంధువులు, ఫ్రెండ్స్‌ను లాటరీ డిస్ట్రిబ్యూటర్లుగా నియమించాడు. వీళ్లు ప్రైజ్‌ విన్నింగ్‌ లాటరీ టికెట్లను తమ వద్దే ఉంచుకుని మిగతా టికెట్లను మాత్రమే అమ్మేవారు.


ఈడీ అధికారుల తనిఖీల్లో అలాంటి వందలాది టికెట్ల కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈడీ అటాచ్‌ చేసిన ఆస్తుల్లో కొన్నింటిని శాంటియాగో మార్టిన్‌ అమ్మేసినట్లు అధికారులు గుర్తించారు. లాటరీ టికెట్లు విక్రయించి.. ఫ్యూచర్‌ గేమింగ్‌ సంస్థ ఏడాదికి రూ.15వేల కోట్ల ఆదాయాన్ని పొందినా.. ప్రభుత్వానికి మాత్రం చాలా తక్కువ మొత్తంలో లాభాలను చూపించిందని ఈడీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ ఫ్యాచర్ గేమింగ్ కంపెనీకి సిక్కిం ప్రభుత్వ లాటరీ స్కీమ్‌ నుంచే భారీగా లాభాలు వచ్చాయని.. ఆ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్‌ ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.


భారత్‌కు పొరుగున ఉన్న మయన్మార్‌లో సాధారణ కూలీ అయిన శాంటియాగో మార్టిన్‌.. 1988లో భారత్‌కు వచ్చాడు. తమిళనాడులో లాటరీ వ్యాపారం ప్రారంభించి కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు విస్తరించాడు. ఆ తర్వాత ఈశాన్య భారతదేశానికి మారిన శాంటియాగో మార్టిన్.. అక్కడ ప్రభుత్వ లాటరీ స్కీమ్‌లతో బిజినెస్ మొదలుపెట్టాడు. కొన్నేళ్లకు భూటాన్‌, నేపాల్‌లోనూ తన బిజినెస్‌లను విస్తరించాడు. ఆ తర్వాత స్థిరాస్తి, నిర్మాణ, టెక్స్‌టైల్‌, ఆతిథ్య రంగాల్లోకి అడుగుపెట్టి.. ఫ్యూచర్‌ గేమింగ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రారంభించాడు. ఈ సంస్థకు వరల్డ్‌ లాటరీ అసోసియేషన్‌లో సభ్యత్వం కూడా ఉండటం గమనార్హం. ఈ కంపెనీ ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినో వంటి వాటిని కూడా నిర్వహిస్తుంది. ఇక ఈ సంస్థ నుంచి వచ్చిన డబ్బుతో 2019-2024 మధ్య రూ.1300 కోట్ల ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసి.. వివిధ పార్టీలకు విరాళంగా ఇచ్చినట్లు ఇటీవల వెల్లడైంది. డీఎంకే, టీఎంసీ వంటి పార్టీలకు రూ.వందల కోట్ల విరాళాలను శాంటియాగో మార్టిన్ అందినట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com