నూతన సంవత్సరం అగ్రరాజ్యం అమెరికాకు ఏమాత్రం కలిసి వచ్చినట్లు కనిపించట్లేదు. న్యూ ఇయర్ వచ్చి మూడు రోజులు గడవకముందే నాలుగైదు ప్రమాదాలు సంభవించగా.. యూఎస్ ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఎక్కడ వాహనాలు బీభత్సం సృష్టిస్తాయో, ఎవరు ఎలా కాల్పులు, పేలుళ్లు జరుపుతారో తెలియక ఆందోళన చెందుతున్నారు. అయితే అమెరికాలో తాజాగా మరో ప్రమాదం జరిగింది. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ భవనంపై చిన్న విమానం క్రాష్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 18 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
దక్షిణ కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీ నగరం ఫుల్లెర్టన్‌లో గురువారం రోజు మధ్యాహ్నం ఓ భనంవపై చిన్న విమానం కూలిపోయింది. ఒక ఇంజిన్, నాలుగు సీట్ల మాత్రమే కల్గిన ఈ విమానం టేకాఫ్ అయిన ఒక్క నిమిషానికే కూలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. బిల్డింగ్ పైభాగంలో పడడంతో... భవనానికి పెద్ద రంధ్రం ఏర్పడింది. దీంతో విమానంలో ఉన్న వారితో పాటు భవనంలో ఉన్న వారికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. మొత్తంగా ఈ ఘటన వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 18 మంది గాయపడ్డారు.
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన వారందరినీ చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను సైతం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని పక్క భవనాల వ్యాపారులను ఇళ్లకు పంపించి వేశారు. ఆపై ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కుట్టు మిషన్లు, టెక్స్‌టైల్స్ కల్గిన ఓ గోదాం భవనంపై విమానం కూలిపోగా.. ఆస్తి నష్టం కూడా జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
ఆస్పత్రికి తరలించిన వారిలో 8 మందికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వారు ఇళ్లకు వెళ్లిపోయనట్లు పోలీసులు తెలిపారు. అలాగే మరో పది మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని స్పష్టం చేశారు. అలాగే మరణించిన వాళ్లు విమానంలో ఉన్న వారా లేక భవనంలో ఉన్నవారా అనేది ఇంకా తెలియలేదని.. పూర్తి విచారణ తర్వాతే అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు.
మరోవైపు ఈ ప్రమాదాన్ని నేరుగా చూసిన వాళ్లు.. విమానంలో కూలిపోవడానికి ముందే అందులోంచి పెద్ద ఎత్తున, పొగలు నిప్పులు వచ్చాయని చెబుతున్నారు. ఫుల్లెర్టన్ లాస్ ఎంజిల్స్‌కు ఆగ్నేయంగా 40 కిలో మీటర్ల దూరంలో మాత్రమే ఉండగా.. లక్షా 40 వేల మంది ఇక్కడ జీవిస్తున్నారు.