దేశద్రోహం ఆరోపణలతో అరెస్టైన ఇస్కాన్ మాజీ నేత చిన్మయ్ కృష్ణదాస్ కు బంగ్లాదేశ్ కోర్టులో మళ్లీ చుక్కెదరయ్యింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను చటోగ్రామ్ కోర్టు తిరస్కరించింది. బెయిల్ కోసం 11 మంది లాయర్ల బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చిన్మయ్ బెయిల్ పిటిషన్‌పై చటోగ్రామ్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో 30 నిమిషాల పాటు వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి మహ్మద్ సైఫుల్ ఇస్లాం.. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రస్తుతానికి దాస్‌కు బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పారు. చిన్మయ్ అరెస్టు అనంతర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని న్యాయస్థానం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
హిందూ సాధువు, బంగ్లాదేశ్ సమ్మిళిత్ సనాతన్ జాగరణ్ జోతే అధికారి ప్రతినిధి అయిన చిన్మయ్ కృష్ణదాస్.. చిట్టగాంగ్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆయన బంగ్లా జాతీయ జెండాను అగౌరవపరిచారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసిన పోలీసులు.. 2024 నవంబరు 25న ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు వద్ద జరిగిన ఘర్షణలో ఓ లాయర్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు.
ఈ కేసులో చిన్మయ్ తరఫున వాదించడానికి ముందుకొచ్చిన లాయర్లపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఎవరూ ముందుకురాకపోవడంతో సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే 11 మందితో లాయర్ల బృందాన్ని ఏర్పాటుచేసింది. విచారణ సమయంలో ఆయన తరఫున లాయర్లు.. చిన్మయ్ దాస్ డయాబెటిస్, శ్వాసకోశ ఇబ్బంది సహా పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని వాదించారు. అంతేకాదు, ఆయనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు పెట్టారని అన్నారు. అయితే, వీటిని న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదు.
కోర్టు నిర్ణయంపై కోల్‌కతా ఇస్కాన్ వైస్-ప్రెసిడెంట్ రాధా రమన్ దాస్ స్పందిస్తూ.. తీవ్ర విచారకరమని అన్నారు. హిందూ సాధువుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన కోరారు. ‘‘ఇది చాలా విచారకరమైన వార్త.. మొత్తం ప్రపంచం దీన్ని గమనిస్తోంది.. కొత్త ఏడాదిలో చిన్మయ్ కృష్ణదాస్‌కు స్వేచ్ఛ లభిస్తుందని భావించారు.. కానీ, 42 రోజుల తర్వాత కూడా బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురయ్యింది.. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆయనకు న్యాయం చేయాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.