కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతోందనేది నిరాధార ఆరోపణ అని స్పష్టం చేశారు. ఈవీఎంలు అత్యంత భద్రతతో కూడినవని, ఈవీఎంలపై సందేహాలు అక్కర్లేదని పేర్కొన్నారు. ర్యాండమ్ గా వీవీ ప్యాట్ లలోని స్లిప్పులను లెక్కిస్తున్నామని, వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపులో ఇప్పటివరకు ఎక్కడా తేడా రాలేదని తెలిపారు. పోలింగ్ శాతం పెరుగుదలపైనా తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. పోలింగ్ సమయం ముగిసే సమయానికి ఎంతో పోలింగ్ శాతం నమోదైందో ఒకసారి ప్రకటిస్తున్నామని రాజీవ్ కుమార్ తెలిపారు. పోలింగ్ సమయం ముగిశాక... అప్పటికే క్యూలైన్లలో ఉన్నవారు ఓటేస్తున్నారని, కొన్ని చోట్ల రాత్రి 8 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతోందని వెల్లడించారు. అందువల్ల పోలింగ్ శాతంపై చివరి లెక్కలు ఆలస్యంగా వస్తున్నాయని వివరించారు. గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో ఓడిపోయిన రాజకీయ పార్టీలు ఈవీఎంలను నిందిస్తుండడం తెలిసిందే. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందంటూ పలు పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం పైవిధంగా స్పందించింది.