వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నారు. ఈనెల 10న వైకుంఠ ఏకాదశిని సందర్భంగా మొత్తం పది రోజుల పాటు వైకుంఠ ద్వారం గుండా భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా టీటీడీ సర్వం సిద్ధం చేసింది. తాజాగా వైకుంఠ ద్వారాలను ఏ రోజునుంచి తెరువనున్నారు.. ఏ సమయంలో ప్రముఖులను అనుమతిస్తారు అనే విషయాలను టీటీడీ ఈవో శ్యామలరావు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఈవో మాట్లాడుతూ.. ఈ నెల 10 నుంచి 19 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుస్తామని తెలిపారు. 10న తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులను దర్శనానికి అనుమతిస్తామన్నారు. అలాగే ఉదయం 8 గంటలకు సర్వదర్శనాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. 9 గంటలకు స్వామి వారు స్వర్ణ రధంపై భక్తులకు దర్శనం కల్పిస్తారన్నారు. 11న తెల్లవారుజామున 4:30 గంటలకు వరాహ పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తామని తెలిపారు.