ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థుల పేర్లను ప్రకటించిన పార్టీలు ఇప్పుడు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఎన్నికల తేదీలు రావడంతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇటు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూనే.. ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీలు.. అనేక హామీలతో ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధికారంలో ఉన్న ఆప్.. తిరిగి సీఎం పీఠాన్ని దక్కించుకునేందుకు అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. అటు బీజేపీ కూడా హామీలు ఇస్తూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ సరికొత్త పథకాన్ని ప్రకటించింది.
ఢిల్లీలో గత 10 ఏళ్లకుపైగా అటు లోక్‌సభ ఎన్నికల్లోగానీ.. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో గానీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీవాసులకు హామీల వర్షం కురిపిస్తోంది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం విడుదల కాగా.. బుధవారం ఢిల్లీ ప్రజలకు వరాల జల్లు కురిపించింది. తాము ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే.. జీవన్ రక్ష యోజన అనే పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ బుధవారం ఈ జీవన్ రక్ష యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. గతంలో రాజస్థాన్‌లో తాము అధికారంలో ఉన్నప్పుడు ఇదే పథకాన్ని అమలు చేసినట్లు గుర్తు చేశారు. అయితే ఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేకుండా దీన్ని అమలు చేసినట్లు తెలిపారు. ఈ పథకం ఢిల్లీకి ఓ గేమ్‌ఛేంజర్ అవుతుందని అశోక్ గెహ్లోత్ పేర్కొన్నారు. ఇప్పటికే ప్యారీ దీదీ యోజన పథకం కింద ఢిల్లీలోని ప్రతి మహిళకు ప్రతి నెలా రూ.2500 ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. ఫలితాలు ఫిబ్రవరి 8వ తేదీన వెలువడనున్నాయి.