వైసీపీ అధినేత జగన్ ఇవాళ తాడేపల్లిలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, చంద్రబాబు దుర్మార్గపు పరిపాలన వల్ల మనం ప్రజలకు తోడుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మన పాలనలో అన్నీ ఇంటివద్దనే డోర్ డెలివరీ చేశాం... కానీ ఇప్పుడు ప్రజలు టీడీపీ నాయకుల వద్దకు తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని జగన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో మనమంతా ప్రజలకు అండగా నిలవాలని నేతలకు కర్తవ్యబోధ చేశారు. తాను కూడా ప్రజల్లోకి వస్తానని జగన్ వెల్లడించారు. జనవరి నెలాఖరు నుంచి లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు వస్తానని ప్రకటించారు. ప్రతి వారంలో 3 రోజులు ఒక పార్లమెంటు స్థానంలో మకాం వేస్తానని, ప్రతి రోజు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమవుతానని వెల్లడించారు. బూత్ స్థాయి నుంచి ప్రతి కమిటీ బలోపేతం కావాలని, సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ఇవాళ మనం కేవలం చంద్రబాబుతోనే యుద్ధం చేయడంలేదు, కుళ్లిపోయిన మీడియాతోనూ యుద్ధం చేస్తున్నాం అని వ్యాఖ్యానించారు. అందుకే పార్టీలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ప్రాధాన్యత గుర్తించాలని జగన్ స్పష్టం చేశారు.