కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందాలని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి కో ఆర్డినేషన్, మానిటరింగ్ కమిటీ(దిశ) సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో లోపాలు గుర్తించి సమీక్షిస్తున్నామన్నారు. జిల్లా అధికారుల సూచనలు పరిగణనలోకి తీసుకుని కేంద్రానికి నివేదిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో 37 పథకాలు అమలవుతున్నాయన్నారు. ప్రతి మూడు నెలలకోసారి దిశ రివ్యూ మీటింగ్ నిర్వహిస్తామన్నారు. హెచ్‌ఎంపీవీ వైరస్‌ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధంగా ఉన్నాయన్నారు.