పండగపూట సొంతూరికి వెళ్లాలనుకునే వారికి ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. ప్రజలంతా పెద్ద ఎత్తున్న సొంతూళ్లకు క్యూకడుతుండటంతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రత్యేక బస్సులు, రైళ్లు ఏర్పాటు చేస్తున్నా అవి కూడా నిమిషాల వ్యవధిలోనే నిండిపోతున్నాయి. దాంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో విమాన టికెట్లకు భారీగా డిమాండ్ ఏర్పడి, ఛార్జీలు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖపట్నం వెళ్లేవారికి విమాన టికెట్ల ధరలు షాక్ ఇస్తున్నాయి. ఇవాళ, రేపు హైదరాబాద్ నుంచి విశాఖకు విమాన టికెట్ ధరలు రూ. 17,500కు పైగా ఉండటం గమనార్హం. ఇక బెంగళూరు నుంచి వైజాగ్‌కు వెళ్లాలంటే కనీసం రూ.12 వేలు పెట్టాల్సిందే. కాగా, సాధారణ రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖకు కనీస ధర రూ. 3,400 నుంచి రూ. 4,000 ఉంటే... ఇప్పుడు అది మూడు నాలుగు రెట్లు పెరిగిపోయింది. ఇక చేసేదేమీలేక కొందరు సొంతూరికి వెళ్లాలనే తాపత్రయంలో వేలకు వేలు పెట్టుకుని మరీ ప్రయాణాలు చేస్తున్నారు.