తిరుపతి తొక్కిసలాట ఘటన ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఈ ఘటనపై మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. తిరుపతి ఘటనలో మూడు రోజులైనా బాధ్యులపై కేసులు లేవని రోజా సెల్వమణి మండిపడ్డారు. తన సొంత టీంలోని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు కాపాడుకుంటున్నారని రోజా ఆరోపించారు. శనివారం నగరి క్యాంప్ కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడారు. తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా బాధ్యులపై కేసు నమోదు చేయకపోవటం దారుణమని రోజా మండిపడ్డారు. ఇంతటి దుర్ఘటన జరిగినా కూటమి ప్రభుత్వంలోని సీఎం, డిప్యూటీ సీఎంలకు బుద్దిరాలేదని రోజా విమర్శించారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనను న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని రోజా కోరారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో తొలి ముద్దాయి చంద్రబాబేనన్న రోజా.. సీఎం చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల వైకుంఠ ద్వారదర్శనానికి లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా.. కావాల్సిన ఏర్పాట్లు చేయలేదన్నారు. వైకుంఠ ద్వార దర్శనం ఉందని తెలిసి కూడా చంద్రబాబు కుప్పం పర్యటన పెట్టుకున్నారని.. తన పర్యటన కోసం మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని మోహరింజేసారని ఆరోపించారు. ఈ కారణంతోనే తిరుపతిలో భక్తుల భద్రతపై అధికారులు దృష్టి సారించలేదని రోజా విమర్శించారు.
ఘటన జరిగి మూడు రోజులు గడుస్తోందని.. చంద్రబాబు తన సొంత మనుషులను కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని రోజా మండిపడ్డారు. చంద్రబాబుకు హిందువులు అన్నా, శ్రీవారి భక్తులు అన్నా ఏ మాత్రం గౌరవం లేదని.. అందుకే తనకు కావాల్సిన వారిని టీటీడీ ఛైర్మన్, తిరుపతి ఎస్పీగా నియమించుకున్నారని ఆర్కే రోజా ఆరోపించారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తన టీంను కాపాడుకోవడమే చంద్రబాబుకు ముఖ్యమైందని మండిపడ్డారు. తొక్కిసలాట ఘటనకు చంద్రబాబు ప్రచార యావే కారణమన్న రోజా.. మూడు రోజుల ముందుగానే టోకెన్లు పంపిణీ చేసి ఉంటే దుర్ఘటన జరిగేది కాదన్నారు. చంద్రబాబు మూడు రోజుల కుప్పం పర్యటనలో స్వర్ణకుప్పం, కుప్పం విజన్ -2029 అంటూ ప్రచారం చేసుకున్నారని.. మూడుసార్లు సీఎం, 30 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉండి చేయలేని పనిని ఇప్పుడు స్వర్ణకుప్పంగా చేస్తారా అంటూ ఎద్దేవా చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్న రోజా.. క్షమాపణలతో ఈ ఘటనను సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గతంలో మహిళపై దాడి జరిగితే బెత్తం దెబ్బలతో సరిచేస్తాను.. ఎవరు తప్పు చేసినా ఊరుకోను, తాట తీస్తాను అంటూ హెచ్చరించిన పవన్ కళ్యాణ్ .. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని రోజా ప్రశ్నించారు. తిరుపతి తొక్కిసలాటకు టీటీడీ చైర్మన్, ఈఓ, జేఈఓ, ఎస్పీలు కారణమంటున్న పవన్ కళ్యాణ్.. మరి వారి తాట ఎందుకు తీయడం లేదని నిలదీశారు. తిరుపతి ఘటనలో బీఆర్ నాయుడు, వెంకయ్య చౌదరి, సుబ్బారాయుడిని శిక్షించడానికి పవన్ కళ్యాణ్ ఏ కులాన్ని చూసి భయపడుతున్నారని రోజా ప్రశ్నించారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ కళ్యాణ్.. ఆరుగురు భక్తులు చనిపోతే క్షమాపణలు చెబితే చాలంటున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్ సంథ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒక్కరు చనిపోతే హీరో దగ్గర నుంచి థియేటర్ యాజమాన్యం వరకూ మొత్తం 14 మందిపై కేసులు నమోదు చేశారన్న రోజా.. తిరుపతి తొక్కిసలాట ఘటనపై చంద్రబాబుతో సహా టీటీడీ ఛైర్మన్, జిల్లా ఎస్పీ సహా కారణమైన అందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి దిగజారుడు రాజకీయం చేస్తున్నారని రోజా మండిపడ్డారు.
వైఎస్ జగన్ తిరుపతిలో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్తే.., కూటమి ప్రభుత్వంను తిట్టాలంటూ బాధితులకు డబ్బులు ఇచ్చారని తప్పుడు వ్యాఖ్యలు చేశారని రోజా ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సైతం బాధితులను పరామర్శించారని.. వారి బాధలుచూస్తే తనకు కన్నీరు వచ్చిందని ఆయనే చెప్పారని, మరి పవన్ కళ్యాణ్‌కు కూడా మేం డబ్బులు ఇచ్చామా అని రోజా ప్రశ్నించారు. మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.