శబరిమల అయ్యప్ప భక్తుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తీసుకొచ్చింది. ఇటీవల చోటుచేసుకున్న వివిధ ప్రమాదాల్లో పలువురు అయ్యప్ప భక్తులు మరణించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీబీ తెలిపింది. ఉచిత బీమా పథకం ద్వారా ప్రమాదంలో చనిపోయిన భక్తుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందచేయనున్నట్టు తెలిపింది. పథనంథిట్ట, కొల్లం, అలప్పుజ, ఇడుక్కి జిల్లాల్లో ప్రమాదం జరిగి.. ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఈ బీమా ప్రీమియం కోసం భక్తుల నుంచి ఎటువంటి మొత్తం వసూలు చేయడం లేదని పేర్కొంది. వర్చువల్ క్యూ లేదా స్పాట్ బుకింగ్ చేసుకున్న భక్తులకు ప్రమాద బీమా పథకం వర్తిస్తుంది.
అలాగే, శబరిమల అయ్యప్ప ఆలయంలో పనిచేసే కార్మికుల కోసం మరో బీమా పథకాన్ని కూడా టీడీబీ ప్రారంభించింది. సన్నిధానం పరిసరాలను శుభ్రపరిచే, పంపా నుంచి భక్తులను మోసుకెళ్లే డోలీ కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. వారు ప్రమాదవశాత్తు మరణించినా.. పూర్తిగా వైకల్యం సంభవించినా రూ.10 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.5 లక్షలు పరిహారాన్ని అందజేస్తామని స్పష్టం చేసింది. అయితే, ఈ బీమా కోసం కార్మికులు రూ.499 లను ప్రీమియం రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
కాగా.. జనవరి 14న శబరిమలలో జరిగే మకరజ్యోతి దర్శనం కోసం టీడీబీ విస్తృత ఏర్పాట్లు చేసింది. లక్షల్లో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగిన భద్రత చర్యలు చేపట్టింది. తొక్కిసలాట వంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సిబ్బందిని మోహరించింది. ఈ క్రమంలో జనవరి 14న మధ్యాహ్నం తర్వాత దర్శనాలను నిలిపివేయనున్నారు. ఆ రోజున జారీచేసే వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ టిక్కెట్లను కుదించారు.
శబరమల అయ్యప్ప ఆలయంలో రెండు నెలల పాటు జరిగే మండల మకరు విళక్కు పూజలు మకర జ్యోతితో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది శబరిమలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు చేసుకుంటున్నారు. కేరళ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.