తిరుమల శ్రీవారి తిరుమల శ్రీవారి పరకామణిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయాడు. 100 గ్రాముల బంగారం బిస్కెట్‌ను కాజేసే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. అతడి ప్రయత్నాలకు విజిలెన్స్ సిబ్బంది చెక్ పెట్టారు. బ్యాంకులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా చేస్తోన్న పెంచలయ్య వ్యక్తి బంగారం బిస్కెట్ ఎత్తుకెళ్తుండగా విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. వ్యర్థాలను బయటకు తరలించే ట్రాలీలో బంగారం బిస్కెట్‌ను దాచిపెట్టాడు. అయితే, బంగారం చోరీని విజిలెన్స్ అధికారులు పసిగట్టారు. అతడ్ని అదుపులోకి తీసుకుని తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, కట్టుదిట్టమైన భద్రత, సీసీకెమెరాల మధ్య లెక్కింపు జరుగుతున్నా.. కొందరు మాత్రం పరకామణిలో చోరీకి ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోంది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి.
మే 2023లో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి చోరీకి ప్రయత్నించి దొరికిపోయాడు. లెక్కింపు సమయంలో కొన్ని విదేశీ కరెన్సీ నోట్లను తన మలద్వారం వద్ద ఉంచుకుని బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే, కాంట్రాక్ట్ ఉద్యోగిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటుచేసిన పరకామణిలో అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా ఉంచడంతో ప్రతి ఒక్కరి కదలికపై నిఘా ఉంచుతున్నారు. గతంలోను ఇలాంటి ఘటనలు జరిగినా వెంటనే గుర్తించే వెసులుబాటు ఉండేది కాదు. కొత్త మండపంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన భధ్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది.
మరోవైపు, తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. శనివారం శ్రీవారిని 53 వేల మంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జనవరి 19 వరకు ఈ దర్శనాలు కొనసాగుతాయి. వైకుంఠ ద్వార దర్శనాలు టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాట చోటుచేసుకుని ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శన టోకెన్లను ముందు రోజు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. జనవరి 13 టోకెన్లను మూడు కేంద్రాల్లో ఆదివారం పంపిణీ చేశారు. తొక్కిసలాట ఘటనతోనూ టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తుల రద్దీ అంతంతమాత్రంానే ఉంది.