పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లి.. అక్కడే ప్రాణాలు కోల్పోయి.. విగతజీవిగా స్వదేశానికి తిరిగిరావడం చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబాలకు జీవితాంతం కన్నీటిబాధను మిగిల్చినట్లే. ఉపాధి కోసం రష్యాకు వెళ్లి.. అక్కడ సైన్యంలో చేరి.. యుద్ధం చేస్తూ తాజాగా కేరళకు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరో వ్యక్తి కూడా గాయపడటంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రష్యా తరఫున యుద్ధంలో పాల్గొంటూ కేరళ వాసి మృతిచెందడాన్ని భారత విదేశాంగశాఖ తీవ్రంగా పరిగణించింది. రష్యాలో యుద్ధం చేస్తున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని ఆ దేశానికి సూచించింది.
ఇదే విషయాన్ని మాస్కోలోని రష్యన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయం అధికారులతోనూ మాట్లాడినట్లు తెలిపింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా.. రష్యాలో ఉన్న మిగిలిన భారతీయులను కూడా అక్కడి నుంచి స్వదేశానికి పంపించాలని డిమాండ్ చేసినట్లు భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.
రష్యా సైన్యంలో పనిచేస్తున్న కేరళకు చెందిన టీబీ బినిల్ అనే 32 ఏళ్ల యువకుడు ఇటీవల మరణించాడు. అతడి బంధువు టీకే జైన్ అనే 27 ఏళ్ల మరో యువకుడికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. అయితే టీబీ బినిల్ మృతి చెందిన విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసినట్లు.. అతడి బంధువులు మీడియాకు వెల్లడించారు. ఈ విషయం తెలిసి టీబీ బినిల్ భార్య షాక్‌కు గురయ్యారు. అయితే టీబీ బినిల్‌ను సురక్షితంగా రష్యా నుంచి తీసుకురావాలని అధికారులకు ఆ కుటుంబం విజ్ఞప్తి చేస్తుండగానే.. ఇలాంటి మరణవార్త వినాల్సి వచ్చిందని వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇక టీబీ బినిల్ మృతి పట్ల కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం.. టీబీ బినిల్ కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోందని ఆయన ట్వీట్ చేశారు. టీబీ బినిల్ మృతదేహాన్ని వెంటనే భారత్‌కు రప్పించేందుకు రష్యన్ అధికారులతో మాట్లాడుతున్నట్లు వివరించారు. అదే సమయంలో యుద్ధంలో గాయపడిన టీకే జైన్‌ను కూడా విడుదల చేసి.. భారత్‌కు పంపించాలని కోరినట్లు రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు.
మరోవైపు.. గతేడాది రష్యాలోని కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సులోనూ భారత్ ఈ అంశాన్ని గుర్తు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య రష్యా సైన్యంలో పనిచేసే భారతీయుల గురించి చర్చలు జరిగినట్లు భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అప్పట్లో తెలిపారు. ఆ సమయంలో రష్యా అంగీకరించడంతో చాలా మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారని పేర్కొన్నారు. మాస్కోలోని భారతీయ రాయబార కార్యాలయం తాజాగా 20 కేసులను పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. వారిని స్వదేశానికి పంపించేందుకు రష్యా అధికారుల సహాయం తీసుకుంటోంది.