విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‍కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం రోజున వెల్లడించారు. ఈ భారీ రివైవల్ ప్యాకేజీ తక్షణం అమల్లోకి వస్తుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఉక్కు రంగంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధానమైన సంస్థగా ఆయన పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో త్వరలోనే రెండు బ్లాస్ట్ ఫర్నేసులు అందుబాటులోకి వస్తాయని.. ఆగస్ట్ నాటికి మూడు ప్రారంభమవుతాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాల కోసం కావాల్సిన ముడి సరకు కోసం ఎన్‌ఎండీసీతో చర్చిస్తున్నట్లు తెలిపారు.
మరవైపు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు (Rashtriya Ispat Nigam Ltd) ప్యాకేజీ ప్రకటనపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. " విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజీ చరిత్రాత్మక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇదో గర్వించదగిన, భావోద్వేగ సమయం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పాటైన తర్వాత ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంది. ఆ కృషికి కేంద్రం స్పందించింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను బతికించడం కోసం రూ.11,440 కోట్లు ఆర్థిక మద్దతు ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ విషయంలో మద్దతుగా నిలిచిన ప్రధానమంత్రి నరేంంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వికసిత్ భారత్ - వికసిత్ ఆంధ్రలో భాగంగా దేశ నిర్మాణం కోసం ప్రధానమంత్రి విజన్‌లో నేనూ భాగస్వామిని అవుతా. " అంటూ నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి సైతం చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మద్దతుగా నిలిచి, సానుకూలంగా స్పందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేవలం కర్మాగారం మాత్రమే కాదన్న చంద్రబాబు.. ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పోరాటాలు, స్ఫూర్తికి చిహ్నంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల హృదయాలలో, మరీ ముఖ్యంగా వైజాగ్ ప్రజల గుండెల్లో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తాము ఇచ్చింది కేవలం ఎన్నికల వాగ్దానం కాదని.. ఆ పోరాటాలకు గౌరవంగా తమ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి మంచి రోజులు రానున్నాయని.. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటూ నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.