దివిసీమను ఎన్నటికీ మరిచిపోలేనని, తన సేవా జీవితానికి నాంది పలికింది అక్కడేనని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం చండీఘర్ రాజ్‌భవన్‌లో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కుటుంబసమేతంగా దత్తాత్రేయను కలిశారు. దివిసీమ ఉప్పెన సమయంలో పనిచేసిన వారందరినీ దత్తాత్రేయ గుర్తు చేసుకున్నారు. పేరుపేరునా వారి గురించి అడిగారు. నాటి ఉప్పెనలో మండలి వెంకట కృష్ణారావు ఎనలేని సేవ చేశారని అన్నారు. కాళ్లలో ముళ్లు గుచ్చుకుని పుండ్లు పడినా లెక్కచేయకుండా అవిశ్రాంతంగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. మండలి కృష్ణారావు-ప్రభావతి దంపతులు తన పట్ల చూపిన ప్రేమాభిమానాలు మరచిపోలేనన్నారు. తన తండ్రి మండలి వెంకట కృష్ణారావు మిమ్మల్ని సోదరుడిగా భావించేవారని, తామూ తమ కుటుంబసభ్యుడిగానే భావిస్తామని దత్తాత్రేయతో బుద్ధప్రసాద్ అన్నారు. బుద్ధప్రసాద్ కుటుంబసభ్యులను దత్తాత్రేయ సత్కరించారు. దత్తాత్రేయను బుద్ధప్రసాద్, వెంకట్రామ్ సత్కరించారు. బుద్ధప్రసాద్ సతీమణి మండలి విజయలక్ష్మి, కుమార్తె శీలం కృష్ణప్రభ, తనయుడు- కోడలు మండలి వెంకట్రామ్- సాయి సుప్రియ పాల్గొన్నారు.