మార్కాపురం, గిద్దలూరు, కంభంలలో కీలకమైన రంగాలకు చెందిన పలువురు వ్యక్తుల అండదండలతో నిర్వాహకులు బహిరంగంగానే మట్కా ఆడిస్తున్నారు..! వందల నుంచి లక్షల స్థాయికి ఈ జూదం పెరిగిపోతున్నది. పోలీసులు కొద్దిరోజుల కిందట మట్కాపై దృష్టి సారించి అరెస్టులు కూడా చేశారు. అయితే తెరవెనుక వ్యక్తులను నియంత్రించ గలిగితే దీనికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. చిన్న చేపలను పట్టుకుని పెద్ద చేపలను వదిలివేస్తే ఇలాగే విస్తరించే ప్రమాదం ఉంది. మట్కా ఎక్కువగా వెనుకబడిన ప్రాంతాలలోనే నడుస్తుంది. గిద్దలూరు, కంభం, మార్కాపురం, చీరాలలో ఎక్కువగా నడుస్తోంది. చిన్నపాటి బుక్కర్లు రూ.10 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తుంటారు. అలా సేకరించిన మొత్తాన్ని కీలక వ్యక్తికి అప్పగిస్తారు. అతను నంద్యాల, అక్కడి నుండి గుంతకల్లుకు, చివరకు బొంబాయిలోని ప్రధాన నిర్వాహకులకు ఆ సొమ్ము చేరుతుంది. ఉదయం నుంచి సాయంత్రం లోగా డబ్బులు చెల్లిస్తే అర్ధరాత్రి ఫలితాలు వస్తాయి. ఎవరికైనా డబ్బులు వేస్తే ఆప్రాంతంలోని బుక్కర్ల ద్వారా డబ్బులు పంపిణీ చేస్తారు. ఎక్కువ మొత్తంలో అయితే రెండు రోజుల సమయం పడుతుంది. పోలీసులు ఎక్కువగా చిన్నపాటి బుక్కర్లనే అరెస్టు చేస్తుంటారు. ఈ సమయంలో కీలకమైన వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లి కొన్నాళ్లు బయటకు రావడం లేదు. ప్రస్తుతం గుంతకల్లు నుంచి నంద్యాల నుంచి వినుకొండ వరకు బుక్కర్లు రైలు ప్రయాణం సాగిస్తూ సెల్‌ఫోన్ ద్వారా మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం. పట్టణాలకే పరిమితమైన బుక్కర్లపైనేకాక భారీ ఎత్తున నగదు సేకరించే కీలక వ్యక్తులపై దృష్టి పెట్టి వారిని నిరోధిస్తేనే మట్కాను అదుపుచేసే వీలుంటుంది.