విశాఖ ఉక్కు కర్మాగారం సత్తా ఏంటో దేశానికి చూపించాల్సిన సమయం వచ్చిందని ఎంపీ ఎం.శ్రీభరత్ అన్నారు. స్టీల్‌ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన రూ. 11,440 కోట్లు ప్యాకేజీని సద్వినియోగం చేసుకునేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. మూడేళ్ల తరువాత మరోసారి సహకారం కోసం వేచి చూసే పరిస్థితి రాకూడదన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్యాకేజీకి పదింతలు భవిష్యత్తులో తిరిగి దేశానికి ఇవ్వాలని పేర్కొన్నారు. ప్యాకేజీ ద్వారా ప్లాంటు కార్యకలాపాలకు నూతనశక్తి వస్తుందన్నారు. గతంలో వాజపేయి హయాంలో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, దివంగత ఎర్రన్నాయుడు, విశాఖ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి కలిసి ప్లాంటును కాపాడారని గుర్తుచేశారు. ఇప్పుడు సీఎం చంద్రబాబునాయుడు, భారత ప్రధాని నరేంద్రమోదీ, నిర్మలాసీతారామన్, కుమార్‌స్వామితో చర్చించడంతో రివైవల్ ప్యాకేజీ ప్రకటించారన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో సంస్థాగతంగా సమూల మార్పులు తీసుకువచ్చేలా, ఆ దిశగా ఉక్కు మంత్రిత్వశాఖ ముందడుగు వేసేలా స్థానిక ఎంపీగా బాధ్యత తీసుకుంటానని శ్రీభరత్ అన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉక్కు కర్మాగారం రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.