తిరుపతి శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ డీన్లు, డైరెక్టర్లు, రిజిస్ట్రార్, డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఆ పిల్ దాఖలు చేయడం వెనుక పిటిషనర్‌కు వ్యక్తిగత ప్రయోజనాలు, కుటిలత్వము ఉన్నాయని పేర్కొంది. వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తన భార్యను డీన్ పోస్టుకు ఎంపిక చేయలేదనే కారణంతో నియామకాలని పిటిషనర్ సవాల్ చేశారని ఆక్షేపించింది. పిల్ వేసిన యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కె. మౌళీకృష్ణకు రూ.50 వేలు జరిమానా విధించింది. ఈ సొమ్మును దృష్టి, వినికిడి లోపం ఉన్న వారి కోసం వినియోగించే నిమిత్తం న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఎస్వీవీయూ డీన్లు, రిజిస్ట్రార్, డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ అధికారంతో ఆ పోస్టుల్లో కొనసాగుతున్నారో వివరణ కోరాలంటూ మౌళీకృష్ణ 2023లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.