పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ విధానం) పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని జూనియర్ కళాశాల మైదానంలో శనివారం జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ (పక్షుల పండుగ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పలు దేశాలు పర్యాటక రంగంతోనే అభివృద్ధి పథంలో నడుస్తున్నాయన్నారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా పులికాట్ పరివాహక ప్రాంతం పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతో అనువైన ప్రాంతమని గుర్తించామన్నారు. అందులో భాగంగా సూళ్లూరుపేటను పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేస్తామని, తద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 2020 తర్వాత పక్షుల పండుగను నిలిపివేయడంతో పర్యాటక అభివృద్ధి మూలన పడిపోయిందని విమర్శించారు. పర్యాటకం, పరిశ్రమలతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం త్వరలో విజయవాడ, విశాఖలలో పెట్టుబడిదారులతో సమావేశం ఏర్పాటు చేస్తుందన్నారు. పక్షుల పండుగతోపాటు విశాఖ, కాకినాడ, తిరుపతిలో ఉత్సవాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సాల్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పరసారత్నం, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, టీడీపీ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్, తానంకి నానాజీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.