ఎక్కడ ఏ విపత్తు వచ్చినా మొదట గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్, ఎన్ఐడీఎమ్ సౌత్ క్యాంపస్ భవనాలను అమిత్‌షాతో కలిసి ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్డీఆర్ఎఫ్ సేవలను కొనియాడారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, అడవుల దహనం, భూకంపాలు వంటి విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ రక్షణ చర్యలతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని అన్నారు. "దేశంలో లక్షల మంది ప్రాణాలను ఎన్డీఆర్ ఎఫ్ బలగాలు కాపాడుతున్నాయి. మన దేశంలో వచ్చిన విపత్తులతో పాటు 2011లో జపాన్, 2015లో నేపాల్, 2023లో టర్కీలో విపత్తులు వచ్చిన సమయంలో మన ఎన్డీఆర్ఎఫ్ నే సేవలందించింది. 2014లో ఉత్తరాంధ్రలో వచ్చిన హుద్‌హుద్, ఇటీవల బుడమేరు వరదల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ చేసిన సాహసోపేతమైన సేవలను ప్రత్యక్షంగా చూశాను.ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణం ఏపీలో ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉంది. 2014లో ఆనాటి రక్షణశాఖ మంత్రి రాజనాథ్‌సింగ్ చేతుల మీదుగా ఈ ప్రాంగణానికి శంకుస్థాన చేశారు. ఎన్ఐడీఎంకు 2018లో వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేశారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కు 50 ఎకరాలు, ఎన్ఐడీఎం ప్రాంగణం నిర్మాణానికి 10 ఎకరాల భూమి ఇచ్చాం. రెండూ పూర్తయి నేడు హోంమంత్రి అమిత్‌షా చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది" అని అన్నారు.