వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసులపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బోగోలు మండలం, కోళ్లదిన్నెలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ, పరస్పర దాడులు జరిగాయి. గాయాలైన వారిని కావలి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రి ఆవరణలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కత్తులు చేతపట్టి హల్ చల్ చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి ఆవరణలో మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో కావలి ఆసుపత్రిలో వైఎస్సార్‌సీపీ నేతలను మాజీ మంత్రి కాకాణి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని, పోలీసులు టీడీపీ వారికి సహకరిస్తున్నారంటూ కాకాణి రివర్స్ ఎటాక్ చేశారు. మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని.. అన్యాయంగా ప్రవర్తించిన వారిని లాక్కొచ్చి నిలబెడతామంటూ వ్యాఖ్యలు చేశారు. రేపటి రోజున అలాంటి వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతుందో గుర్తు చేసుకోవాలంటూ హెచ్చరిక చేశారు.