పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు ఓ యువకుడు బలయ్యాడు. పట్టణంలోని ప్రకాష్ నగర్‌లో ఉంటున్న కనుపోలు ఉదయ్ కిరణ్(32) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఉదయ్ కిరణ్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో దాదాపు రూ.10 లక్షలకు పైగా పోగొట్టుకున్నాడు యువకుడు. బెట్టింగ్‌ల కోసం ఎక్కడపడితే అక్కడ అప్పులు చేసిన యువకుడు.. చివరకు ఉన్నదంతా పోవడంతో అప్పులు తీర్చలేక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఉదయ్ కిరణ్ బయటకు రాకపోవడంతో స్థానికులు అనుమానం వచ్చి చూడగా.. యువకుడు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పులు బాధతో కొడుకు ప్రాణాలు తీసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.