పాకిస్థాన్ వేదికగా వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భారత టీ20 కెప్టెన్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కలేదు. దీనిపై సురేశ్ రైనా సహా పలువురు భారత మాజీ క్రికెటర్లు.. పెదవి విరిచారు. అతడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఎక్స్ ఫ్యాక్టర్‌గా పనిచేస్తాడని అభిప్రాయం వ్యక్తం చేశారు. అతడిని ఎంపిక చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సూర్యకుమార్ ఈ విషయంపై స్పందించాడు.
భారత వన్డే జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై తానేమీ బాధపడలేదని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు. తాను బాగా రాణించి ఉంటే.. జట్టులో ఉండేవాడినని వ్యాఖ్యానించాడు.
‘ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కకపోవడంపై నేనేమి బాధ పడడంలేదు. వన్డే ఫార్మాట్‌లో బాగా రాణించి ఉంటే ఈ జట్టులో ఉండేవాడిని. కానీ, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయా. అందుకే నాకు అవకాశం దక్కలేదు. ఎప్పుడైనా మన తప్పిదాన్ని అంగీకరించడం ముఖ్యం. అయితే నాకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయినందుకు మాత్రం బాధగా ఉంది. అదే నేను బాగా ఆడి ఉంటే, వన్డే జట్టులో కచ్చితంగా కొనసాగి ఉండేవాడిని’ అని సూర్యకుమార్ యాదవ్ తన మనసులోని మాటను చెప్పాడు.
‘ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టు చాలా బాగుంది. టీమ్‌లోని వారంతా అద్భుతమైన ఆటగాళ్లు. వన్డే ఫార్మాట్‌లో భారత్ తరఫున మెరుగైన ప్రదర్శన చేశారు. కాబట్టి వారందరూ జట్టులో ఉండాల్సిన వారే” అని సూర్యకుమార్ పేర్కొన్నాడు.
టీ20లతో పోలిస్తే.. వన్డే ఫార్మాట్‌లో సూర్యకుమార్ ఆశించిన మేర రాణించలేకపోయాడు. 37 వన్డేలు ఆడిన సూర్య.. 25 సగటుతో 736 పరుగులు చేశాడు. టీ20ల్లో 74 ఇన్నింగ్స్‌లలో 40 సగటుతో 1531 రన్స్ స్కోరు చేశాడు. తనకు వచ్చిన అవకాశాలను సూర్యకుమార్ సద్వినియోగం చేసుకోకపోవడంతో.. అతడిని వన్డే ఫార్మాట్‌కు సెలక్టర్లు పక్కన పెట్టారు. దీంతో టీ20ల్లో భారత జట్టు రెగ్యూలర్ కెప్టెన్‌గా ఉన్నప్పటికి.. వన్డేలకు మాత్రం మిస్టర్ 360ని పరిగణలోకి తీసుకోలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, యశస్వి జైశ్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా.